Telangana

ఈసీపై బీజేపీ ఒత్తిడి… కేటీఆర్ విమర్శలు

మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం చర్యను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. మునుగోడు రిటర్నింగ్ అధికారి బదిలీ వ్యవహారంలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమన్నారు కేటీఆర్. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ఏ రీతిన దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది మరో ఉదాహరణగా నిలిచిందని ఆయన విమర్శించారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి తెచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి కేటాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనన్నారు. గతంలో తమ అభ్యర్థన మేరకు రోడ్డు రోలర్ గుర్తును ఎన్నికల సంఘం తొలగించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకసారి రద్దు చేసిన గుర్తును తిరిగి మరోమారు అభ్యర్థికి కేటాయించడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తమ పార్టీ గుర్తు కారును పోలిన గుర్తులతో ఓటర్లను అయోమయానికి గురి చేసి దొడ్డిదారిన ఓట్లు పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అధికారిని బదిలీ చేసిన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.