Andhra PradeshHome Page Slider

జగన్, చంద్రబాబు, పవన్ విషయంలో బీజేపీ గేమ్ ప్లాన్!? – మనసర్కార్ ఎక్స్‌క్లూజివ్

ఏపీ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాలకు కారణమవుతున్నాయి. అసలు ఏపీ విషయంలో కేంద్రం రోలేంటన్న చర్చ ఇప్పుడు ఎక్కువగా విన్పి్స్తోంది. వాస్తవానికి ఏపీ రాజకీయాలకు, కేంద్రంలోని బీజేపీ పెద్దలకు సంబంధం ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత బీజేపీ పెద్దల మౌనంగా ఉండటం అసలు చర్చకు కారణమని చెప్పాల్సి ఉంటుంది. స్వాగతించడం లేదంటే, సత్సంప్రదాయం కాదని చెప్పడం కానీ చేయాల్సిన బీజేపీ పెద్దలు అసలు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఇప్పటి వరకు ఉలకలేదు. పలకలేదు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో, బీజేపీ తోడ్పాటు లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసే సాహసం చేయరన్న అభిప్రాయం కూడా సాధారణ ప్రజానీకంలో ఉంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబును అరెస్టు విషయాన్ని కేంద్ర పెద్దలకు కచ్చితంగా చేరవేసే ఉంటారని కూడా భావించాల్సి ఉంటుంది. అందుకే కొందరు జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దలతో మాట్లాడుకున్నాకే, చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. అందుకే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని అంటున్నారు.

ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు అలయన్స్‌లో ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు నేరుగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే పొత్తు అంటూ చెప్పడం వెనుక బీజేపీని ముగ్గులోకి దించాలన్న ఆలోచన ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంది. కానీ రియల్ పొత్తు టీడీపీ-బీజేపీ మధ్య అని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేష్ ఢిల్లీ టూర్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ ఢిల్లీ ఎందుకు వెళ్లారన్నది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. తన తండ్రిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్న విషయాన్ని అటు జాతీయ మీడియాతోపాటుగా, ప్రభుత్వ పెద్దలకు చెప్పాలనే వెళ్లారు. యువగళం యాత్ర తర్వాత పార్టీలో నెంబర్ 2 స్థానానికి చేరుకున్న లోకేష్.. ఇప్పుడు కష్ట సమయంలో పార్టీని, తండ్రిని కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా తీసుకుంటున్నారనుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో పార్టీని ఎవరు నడిపిస్తారు? ఎవరు పార్టీ కార్యకలాపాలు చూస్తారన్న చర్చ పెద్ద ఎత్తున విన్పిస్తోంది. చంద్రబాబు స్థానాన్ని బాలకృష్ణ భర్తీ చేస్తారని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తుంటే, కాదు కాదు లోకేష్ మాత్రమే చూసుకుంటారని మరికొందరు తేల్చేస్తున్నారు. ఈ తరుణంలో లోకేష్ బాబు ఢిల్లీ పర్యటన ద్వారా బీజేపీ పెద్దలను కలిసి న్యాయం చేయాలని కోరతారా అన్నది చూడాల్సి ఉంది. లోకేష్ హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అమిత్ షాకు ఈ విషయాన్ని ఏపీలో టీడీపీకి మద్దతుగా బీజేపీలో ఉంటున్న నాయకులు చేరవేశారు కూడా. అయితే మొత్తం వ్యవహారం బీజేపీకి తెలియకుండా జరిగిందా అంటే చెప్పలేం! ఈ తరుణంలో బీజేపీ ఏపీ విషయంలో అసలేం చేస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఏపీ రాజకీయాలను ఏం చేయాలన్నదానిపై బీజేపీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డితో పరోక్షంగా పొత్తులో ఉండటం. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి భవిష్యత్ లేకుండా చేసుకోవడం. అంటే గుండు సున్నా అన్నమాట. వాస్తవానికి ఏపీ గురించి బీజేపీ పెద్దలు పెద్దగా ఆలోచించడం లేదని పురంధేశ్వరికి నాయకత్వం అప్పగించినప్పుడే ఒక క్లారిటీ వచ్చిందని.. మొదట్నుంచి బీజేపీలో ఉన్న ఏపీ నాయకులు పరోక్షంగా చెబుతూ వస్తున్నారు. వైఎస్ జగన్‌కు బీజేపీ మద్దతివ్వడమంటే, రాజకీయంగా ఏపీలో తమ పార్టీకి ఉనికి లేకుండా చేసుకోవడమని చెప్పాల్సి ఉంటుంది. అటు ఎంపీలు గానీ, ఇటు ఎమ్మెల్యేలు గానీ ఏమీ గెలవకుండా ఏపీని పూర్తిస్థాయిలో జీరో చేసుకోవడమే. ఇలాంటి పరిస్థితిని దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కోరుకోదు. కానీ ఎలాంటి పొత్తు లేకుండా, బీజేపీ నడుచుకోమన్నట్టుగా వ్యవహరిస్తున్న వైసీపీ విషయంలో బీజేపీ ఆ మాత్రం మినహాయింపు ఇవ్వదా అన్న అభిప్రాయం కూడా ఉంది. ఏపీలో జగన్ ఎన్ని గెలిచినా, అవి తమ ఖాతాలోకేనన్న అభిప్రాయం అప్పుడు బీజేపీ పెద్దల్లో ఉందనుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పవన్ కల్యాణ్-టీడీపీతో కలిసి వెళ్తున్నప్పటికీ చూస్తూ ఉండటం తప్ప మరేం చేయకపోవచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన విజయం సాధించినా, తమతో ఎలా ఉంటారన్నదానిపై బీజేపీ పెద్దల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమకు పూర్తి స్థాయిలో మద్దతు రాకుంటే అప్పుడు ఏపీ లాంటి రాష్ట్రంలో తటస్థంగా ఉండే పార్టీలు కూడా మద్దతివ్వాల్సిన పరిస్థితిలో బీజేపీ ఉంటుంది. అందుకే బీజేపీ ఎక్కువ రిస్క్ లేకుండా ఒంటరిగా పోటీ చేయవచ్చు. జగన్‌ను టేక్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోవచ్చు. లేదంటే ప్లాన్-బి ఉండనే ఉంది కదా…

ఈ ప్రణాళికలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి, చంద్రబాబు నాయుడిని కాన్ఫిడెన్స్‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీతో కలిసి పోటీ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి మొన్నటి వరకు పొత్తును డిసైడ్ చేయాల్సింది తామని భావించిన బీజేపీ పెద్దలకు పవన్ కల్యాణ్ పెద్ద ఝలకే ఇచ్చారు. బీజేపీతో సంబంధం లేకుండా పొత్తును ఎనౌన్స్ చేసి సాహసం చేశారు. ఇలాంటి తరుణంలో బీజేపీ తగ్గుతుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేస్తున్న బీజేపీ ఎన్నికల్లో అదే వైసీపీపై పోటీ చేయాల్సి ఉంటుంది. పోరాటం చేయాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల్లో ఉన్న సీన్ రిపీట్ అవుతుందనుకోవాల్సి ఉంటుంది. నాడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయకున్నా, బీజేపీ కొంత పోటీ చేసి కొంతమేర రాజకీయ ప్రయోజనం పొందింది. అయితే ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి, బీజేపీతో ప్రేమ నటిస్తున్నారు. కలిసి ముందుకు సాగుతున్నారు. అన్ని విషయాల్లో బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. 2018లో టీడీపీ-బీజేపీ పొత్తు పెటాకులయ్యాక, రెండు పార్టీల మధ్య బంధం మరింత బలపడింది. నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా బీజేపీ ఫోల్డ్‌లో ఉన్నారనుకోవాల్సి ఉంటుంది. 2014కి ముందు ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన జగన్మోహన్ రెడ్డి అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ అని, తనను అకారణంగా శిక్షించందని భావిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న జగన్, బీజేపీతో చెలిమి చేయాల్సి ఉన్నప్పటికీ.. అందుకు తటపటాయిస్తూ వచ్చారు. తాను సెక్యులర్ అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లు దూరమవుతారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి, బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తూనే ఉన్నారు తప్పించి నేరుగా ఎలాంటి లావాదేవీలు పెట్టుకోలేదు. ఇలాంటి తరుణంలో బీజేపీ, జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏం చేస్తుంది? ఎలా వ్యవహరిస్తుందన్న సందిగ్దత నెలకొంది.

ఏపీలో బీజేపీని గుండు సున్నా చేసుకోవడమా? లేదంటే గుడ్డిలో మెల్లగా చేసుకోవడమా అన్నది చూసుకోవాల్సి బీజేపీ హైకమాండ్ మాత్రమే. ఎంతోకొంత పర్ఫామెన్స్ చూపించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని వాడుకోవడమా అన్నది చూడాల్సి ఉంది. టీడీపీ-జనసేన పొత్తులో ఉంటే, అప్పుడు రాజకీయంగా కొంత ఓటు బ్యాంక్ కాన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రాజకీయంగా ఏపీలో పెద్దగా సాధించాల్సింది ఏమీ లేదనుకుంటే… జగన్మోహన్ రెడ్డికి పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక రాజకీయ పార్టీ అలా అనుకుంటుందని మన ఊహించలేం. ఏపీలో నాలుగైదు ఎమ్మెల్యేలు, రెండు మూడు ఎంపీలను గెలుచుకునేందుకు వచ్చిన పొత్తు బేరాన్ని బీజేపీ వదులుకుంటుందని కూడా చెప్పలేం. అందుకే రాజకీయంగా కలిగే లబ్ధిని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. అందుకే బీజేపీ పెద్దలు ఓవైపు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తూనే, టీడీపీ-జనసేనతో పొత్తు పెట్టుకోవడం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ పెద్దల ముందు ఉన్న ఆప్షన్ ఇదేనని భావించాల్సి ఉంటుంది. అందుకు చంద్రబాబునాయుడు జైలు ఎపిసోడ్‌ను సైతం బీజేపీ తమకు అనుకూలంగా మలచుకునే అవకాశం ఉంది.

చంద్రబాబుకు త్వరలోనే బెయిల్ వస్తోందని ఒక సెక్షన్, రాదని మరో సెక్షన్ బల్ల గుద్దీ మరీ చెబుతున్న తరుణంలో, పసుపు బార్గెయిన్ పవర్ తగ్గాలంటే అందుకో లెక్క తప్పనిసరిగా ఉంటుంది. రాజకీయాన్ని పూర్తి స్థాయిలో వంటబట్టించుకున్న మోడీ, అమిత్ షా మొత్తం వ్యవహారాన్ని ఒక పట్టాన తేల్చకపోవచ్చు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తారని చెప్పలేం. ఓకేసారి అటు చంద్రబాబుతోనూ, ఇటు జగన్మోహన్ రెడ్డితోనూ డీల్ చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. పొత్తు ఉంటేనే ఎన్నికల బరిలో జగన్మోహన్ రెడ్డితో ఢీ అంటే ఢీ అనొచ్చన్న భావనలో ఉన్న టీడీపీకి, ఇప్పుడు బీజేపీ చల్లని చూపు అత్యవసరం. అదే సమయంలో టీడీపీపై మరింత కటువుగా వ్యవహరించాలంటే బీజేపీ అండ, జగన్మోహన్ రెడ్డికి అత్యవసరం. అసలు పార్టీగా నిలదొక్కుకోవాలంటే జనసేనానికి బీజేపీ కరుణ ఎంతో ముఖ్యం. వాస్తవానికి ఏపీలో ఎలాంటి స్టేక్స్‌కు గ్యారెంటీ లేనప్పటికీ బీజేపీ పోషిస్తున్న పాత్ర వామ్మో అనుకోవాల్సిందే అన్నట్టుగా ఉందని మాత్రం చెప్పాల్సి ఉంటుంది.