జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుపై బీజేపీ కసరత్తు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పై బీజేపీ నేతలు శుక్రవారం సమావేశం నిర్వహించారు. మూడు పేర్లను ఖరారు చేసి పార్టీ సెంట్రల్ కు పంపించనున్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ మీటింగ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ సీటు గెలిచి ప్రధాని మోదీకి గిఫ్ట్ గా ఇవ్వాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని విషాద నగరంగా మార్చారని దుయ్యబట్టారు. హైదరాబాద్ మహా నగరాన్ని ఎవరూ అభివృద్ది చేయలేదని.. వానపడితే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ బై పోల్ పై అందరి ఫోకస్ పడింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను బరిలోకి దించింది. బీసీ సామాజిక వర్గానికే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి చెబుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది.

