Home Page SliderNational

జమ్ము, కాశ్మీర్ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ డైలమా!?

జమ్మూ కాశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల ఎన్నికలకు 44 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను తొలుత బీజేపీ విడుదల చేసింది. అయితే కొన్ని గంటల తర్వాత, డిలీట్ చేసింది. అయితే మొదటి దశ ఎన్నికలకు ఎంపికైన 15 మంది అభ్యర్థుల పేర్లు మాత్రం తిరిగి అధికారికంగా ప్రకటించింది. మొదటి దశకు ఎంపికైన అభ్యర్థుల్లో ఎలాంటి మార్పులు చేయని పార్టీ, కీలక నేతలను మాత్రం తప్పించింది. బీజేపీ విడుదల చేసి డిలీట్ చేసిన లిస్టులో ముగ్గురు కీలక నేతలు మిస్సయ్యారు. లిస్టులో కన్పించనివారిలో జమ్మూ కాశ్మీర్ బిజెపి అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తా ఉన్నారు. ఈ జాబితాలో నేషనల్ కాన్ఫరెన్స్ నుండి పార్టీ మారిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోదరుడు దేవేంద్ర రాణా పేరు ఉంది.

వాస్తవానికి 44 మంది జాబితా విడుదల చేసిన సమయంలో ఇద్దరు కాశ్మీరీ పండిట్‌లు 14 మంది ముస్లిం అభ్యర్థుల పేర్లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి, పాంథర్స్ పార్టీకి చెందిన పలువురు మాజీ నాయకులు, పార్టీ మారిన బీజేపీలో చేరిన వారు కూడా ఇప్పుడు తొలగించిన జాబితాలో ఉన్నారు. తొలి జాబితా విడుదలైన తర్వాత కొన్ని కీలక లోపాలను పార్టీ గుర్తించినట్టు తెలుస్తోంది. పార్టీలో విమర్శల నేపథ్యంలో, మూడు దశల జాబితాను ఉపసంహరించుకోవాలని, ఒక్క మొదటి దశ అభ్యర్థుల పేర్లను మాత్రమే విడుదల చేయాలని పార్టీ నిర్ణయించింది. సెప్టెంబర్ 19, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో జమ్మూ కాశ్మీర్ ఓటింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను కోల్పోయి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలివి.

రాబోయే ఎన్నికల కోసం పార్టీ ఎన్నికల ఎంపికలను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన తర్వాత ఈ ఉదయం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. నిన్న ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. పీడీపీ 28 విజయాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ 15 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 12 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల తరువాత, 2016లో మాజీ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఆ తర్వాత మెహబూబా ముఫ్తీ కొనసాగారు. బీజేపీ, PDP కలిసి ప్రభుత్వం ఏర్పాటు సంచలనం కలిగించింది.


జమ్మూకశ్మీర్‌లో బీజేపీ, పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమి మధ్య త్రైపాక్షిక పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు సీట్ల పంపకాల్లో విభేదాలు పరిష్కారం కాలేదు. నేషనల్ కాన్ఫరెన్స్, స్థానిక కాంగ్రెస్ నాయకత్వం మధ్య జరిగిన చర్చల్లో అడ్డంకులు తొలగించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు కెసి వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్‌లను శ్రీనగర్ వచ్చారు. అంతకుముందు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సమావేశమై పొత్తును ప్రకటించారు. అయితే ఈ పొత్తు చిత్తవుతుందని ఎన్నికల్లో కూటమి విఫలమవుతుందని జమ్మూ కాశ్మీర్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు.