Home Page SliderNational

మహారాష్ట్ర ఉపఎన్నికల్లో ఒకచోటి బీజేపీ, ఒకచోట కాంగ్రెస్ గెలుపు

మహారాష్ట్రలోని కస్బా పేటలో ఈరోజు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర ధంగేకర్ 12,000 ఓట్లకు పైగా బీజేపీ అభ్యర్థి హేమంత్ రసానేపై విజయం సాధించారు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో మరో స్థానానికి కూడా కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నికల సంఘం తుది ఫలితాలు వెల్లడించనప్పటికీ, కస్బా పేటలో తమ అభ్యర్థి గెలిచినట్లు కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే ప్రకటించారు. విజయోత్సవ సంబరాలు జరుపుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం వెలుపల గుమిగూడారు. కస్బా పేట్ నియోజకవర్గంలో దాదాపు 28 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని కాంగ్రెస్ గద్దె దింపింది. ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేలు ముక్తా తిలక్ (కస్బా), లక్ష్మణ్ జగ్తాప్ (చించ్వాడ్) మరణించిన తర్వాత ఫిబ్రవరి 26న ఎన్నికలు జరిగాయి. 50 శాతం ఓటింగ్ నమోదైంది.

కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ థాక్రే శివసేన కూటమికి వ్యతిరేకంగా బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పోటీ చేసిన మొదటి ఎన్నికలు ఇవి. ఐతే చించ్వాడ్‌లో బీజేపీ అభ్యర్థి అశ్వని జగ‌తప్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. పూణేలోని కస్బా, చించ్వాడ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు కాంగ్రెస్ కూటమికి అలాగే రాష్ట్రంలోని అధికార షిండే-బిజెపి సంకీర్ణానికి ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ వంటి పెద్ద నాయకులు తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న లోక్‌సభ సభ్యుడు గిరీష్ బాపట్‌ను ఎన్నికల సమయంలో ప్రచారానికి బీజేపీ బలవంతం తెచ్చిందంటూ కాంగ్రెస్ విమర్శించింది.