కిరణ్ కుమార్ రెడ్డి రాకతో బీజేపీ బలోపేతం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాకతో ఆంధ్ర ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి మరింత దోహదపడుతుందనే ఆశాభావాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి ఫోనులో సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరటాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. తొందరలోనే కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమై రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో భారతీయ జనతా పార్టీ మరింత శక్తివంతమై ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగటంతో పాటు 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు సోము వీర్రాజు స్పష్టం చేశారు.
