వచ్చే ఎన్నికల్లో 70 స్థానాలు బీజేపీకే
తెలంగాణాలో బీజేపీ పుంజుకుంటోందనే విషయం మునుగోడు ఉప ఎన్నికలో మరోసారి రుజువైందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 65-70 స్థానాలు బీజేపీ ఖాతాలో పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేసి ఉంటే మునుగోడులో టీఆర్‌ఎస్ ఓడిపోయేదని వివేక్ స్పష్టం చేశారు. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని, మంత్రులు, ఎమ్మెల్యేలంతా మునుగోడులోనే తిష్ట వేసి ప్రచారం చేశారని, కమ్యూనిస్టుల మద్దతు తీసుకున్నారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని.. ఇంత చేసినా టీఆర్ఎస్ చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంలో గెలిచిందని ఎద్దేవా చేశారు.

రాజగోపాల్‌కు డబ్బులు ఇవ్వలేదు..
మంత్రి కేటీఆర్ ఆరోపించినట్లు తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి డబ్బులు ఇవ్వలేదని వివేక్ వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో తమ కంపెనీ కోసం భూమి కొనుగోలు చేశామని.. కేటీఆర్ మాత్రం హవాలా లావాదేవీలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్ నుంచి తనకు 2.5 కోట్ల రూపాయలు వచ్చాయన్న ఆరోపణల్లోనూ నిజం లేదని.. అవసరమైతే రాష్ట్ర పోలీసులతో విచారణ జరిపించుకోవచ్చని సీఎం కేసీఆర్‌కు వివేక్ సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను త్వరలో బయట పెడతామని హెచ్చరించారు. పటాన్‌చెరులో ఉన్న తన ఫ్యాక్టరీని మూసివేయించి.. తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.