Home Page SliderTelangana

మధ్యాహ్నం ఈటలతో ఎన్నికల ప్రచారం సాయంత్రం, కాంగ్రెస్ కండువా!

రాజకీయాలు అనూహ్య సంఘటనలకు వేదికలుగా నిలుస్తాయ్. అధికారమే పరమావధిగా నాయకులు సర్కస్ ఫీట్లతో రక్తికట్టిస్తుంటారు. కొన్నిసార్లు అవి కలిసిరావచ్చు. మరికొన్నిసార్లు బెడిసికొట్టొచ్చు. కానీ విన్యాసాలు మాత్రం వేస్తూనే ఉంటారు. తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి తీరు అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్ ఒక్క పూటలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఆయన రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందితపై 17 వేల చిలుకు ఓట్లతో ఓడిపోయారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన గద్దర్ కుమార్తె మూడో స్థానంలో నిలిచారు.

ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భావించిన బీజేపీ, ముందుగానే శ్రీగణేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం సైతం నిర్వహించారు. మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటలతో కలిసి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కన్ను శ్రీగణేష్ పై పడింది. గద్దర్ కుమార్తె గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో, ఈసారి బలమైన అభ్యర్థిని రేసులో నిలిపాలని భావించింది. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి, శ్రీగణేష్ పేరును పార్టీ నేతలు రిఫర్ చేశారు.

దీంతో ఆయనతో పార్టీ నేతలు చర్చలు జరిపారు. టికెట్ పై భరోసా ఇస్తే పార్టీలోకి వస్తానని ఆయన చెప్పడంతో, పార్టీ ఆయనకు టికెట్ కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందనే తాను హస్తం కండువా కప్పుకున్నట్టు శ్రీగణేష్ చెప్పారు.