Home Page SliderNational

ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ 25 కోట్లు ఆఫర్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ రాజధానిలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి ₹ 25 కోట్ల ఆఫర్‌తో “కొనుగోలు” చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శాసనసభ్యులతో బీజేపీ చర్చలు జరుపుతోందని, ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రిని త్వరలో అరెస్టు చేస్తామని బెదిరిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే దుష్ట ప్రణాళిక చుట్టూ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఉందని ఆయన ఆక్షేపించారు.

సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్‌లో, ఢిల్లీ ముఖ్యమంత్రి బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. “ఇటీవల, బిజెపి, ఢిల్లీ ఎమ్మెల్యేలలో 7గురిని సంప్రదించి – ‘మేము కొన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తాం. ఆ తర్వాత, ఎమ్మెల్యేలను చిన్నాభిన్నం చేస్తాం. 21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపాం. ఇతరులతో కూడా మాట్లాడుతున్నాం. ఆ తర్వాత ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం.. మీరు కూడా రండి. ₹ 25 కోట్లు ఇచ్చి ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేయిస్తాం”. అంటున్నారని ట్వీట్ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలను సంప్రదించినట్లు చెబుతున్నప్పటికీ… కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలను మాత్రమే సంప్రదించారని ఆప్‌కి అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోందని, ఐతే ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ఆ డీల్‌ను తరిస్కరించారని చెప్పారు.

“మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి నన్ను అరెస్టు చేసే ఆలోచన వారికి లేదని… కాకుంటే, వారు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పన్నుతున్నారని” కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ‘గత తొమ్మిదేళ్లలో మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎన్నో కుట్రలు పన్నారు.. ఎందులోనూ వారు సఫలం కాలేకపోయారని కేజ్రీవాల్ విమర్శించారు. దేవుడు, ప్రజలు మమ్మల్ని ఎప్పుడూ ఆదరించారు.. మా ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉన్నారు.. ఈసారి కూడా వాళ్ల నీచమైన పనిలో విఫలమవుతారని బీజేపీపై మండిపడ్డారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ చేస్తున్న మంచి ప్రయత్నాల కారణంగానే… తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ తెలిపారు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ… ఢిల్లీ ప్రజలు ఆప్ పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉన్నారు, ఇది ఎన్నికలలో బీజేపీని ఓడిస్తోందన్నారు.