Andhra PradeshNews

టీడీపీతో పొత్తుకు బీజేపీ ‘నై’

ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దియోధర్ స్పష్టం చేశారు. తమ మిత్రపక్షం జనసేన బీజేపీ దూరమై తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతుందని ఏపీలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దియోధర్ తమ పార్టీ వైఖరిని ప్రకటించారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన దీవాలి మిలన్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీజేపీ, జనసేన తెలుగుదేశం కూటమి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ తెలుగుదేశం పార్టీతో తాము గతంలో పొత్తు పెట్టుకుని చేదు అనుభవాలు చవిచూసామని ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రెండు అవినీతి కుటుంబ పార్టీలేనని ఆయన విమర్శించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు వ్యాఖ్యలపై స్పందన కోరగా జనసేనతో రోడ్డు మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని దాని గురించి అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు. అలానే కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని కూడా తాము సీరియస్ గా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య ఎలాంటి విభేదాలు లేవని వివరించారు. తెలుగుదేశంతో పొత్తు ఉండదని దియోధర్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ ,జనసేన, వామపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.