Home Page SliderNational

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ఇలాకాలో 5 సీట్లలోనే బీజేపీ ఓటమి

భారతీయ జనతా పార్టీ హిమాచల్ ప్రదేశ్‌లోని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభ నియోజకవర్గం హమీర్‌పూర్ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలను కోల్పోయింది. అయితే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వస్థలం బిలాస్‌పూర్ నుండి మూడు స్థానాలను గెలుచుకుంది. గతంలో… అనురాగ్ ఠాకూర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ పోటీ చేసిన సుజన్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి 399 ఓట్ల తేడాతో గెలుపొందారు. ధుమాల్‌కి ఈసారి టిక్కెట్ ఇవ్వకపోవడంతో రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పారు. తన తండ్రి కష్టపడి పనిచేసినా టికెట్ లభించలేదని బహిరంగంగా అనురాగ్ కన్నీరు కార్చాడు. బొరంజ్‌లో బీజేపీ కేవలం 60 ఓట్ల తేడాతో ఓడిపోయింది. హమీర్‌పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థికి విజయం సాధించగా… బర్సార్, నదౌన్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక నడ్డా స్వస్థలమైన బిలాస్‌పూర్‌లో, బీజేపీ అభ్యర్థులు స్వల్ప ఓట్లతో మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. బీజేపీ ఓడిపోయిన తరువాత, అనురాగ్ ఠాకూర్ వెంటనే బీజేపీ మద్దతుదారుల నుండి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీ అంతర్గత పోరుకు ఠాకూర్ కారణమంటూ వారు నిందించారు.

68 నియోజకవర్గాల్లో కనీసం 21 స్థానాల్లో బీజేపీ రెబల్స్ పోటీ చేయడం వల్లే ఇలాంటి దుస్థితి కలిగిందని విమర్శించారు. రెబల్స్‌లో ఇద్దరు మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించారు. కొందరు భారీగా ఓట్లను చీల్చడంతో బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హిమాచల్ ప్రదేశ్ ఓటమికి కారణమేమంటే.. బీజేపీలో మూడు ఫ్యాక్షన్లే కారణమన్న అభిప్రాయం ఉంది. అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డా ఒక్కొక్క వర్గానికి నాయకత్వం వహిస్తుంటే సీఎం జైరామ్ ఠాకూర్‌ వర్గం మరోటి ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకొని.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. బీజేపీ 25 సీట్ల వద్దే ఆగిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ ఒక్క సీటు కూడా గెలవలేదు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతి ఐదేళ్లకోసారి బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య అధికారం మారుతూ ఉంది. ఐతే డబుల్ ఇంజిన్ కాన్సెప్ట్‌తో హిమాచల్ ప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో రెండోసారి అధికారం సాధించాలని ప్రయత్నించి బీజేపీ విఫలమయ్యింది.