జమ్ము, కశ్మీర్‌లో రిజర్వేషన్ల అస్త్రంతో బీజేపీ దూకుడు
గుజ్జర్లు, బకర్వాల్‌లతో పాటు పహారీ సామాజిక వర్గానికి కూడా త్వరలో విద్యా, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ తెగ ఎస్టీలుగా రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో ప్రకటించారు. పహారీలు ST హోదాను పొందినట్లయితే, భారతదేశంలో ఒక భాషాపరమైన సమూహం రిజర్వేషన్లు దక్కించికోవడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ చేత ఏర్పాటు చేసిన శర్మ కమిషన్ నివేదిక ఆధారంగా… గుజ్జర్, బకర్వాల్, పహారీ వర్గాలకు రిజర్వేషన్లు అందించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. త్వరలో ఇది సాకారం కానుందని తెలిపారు.

త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధమవుతున్న తరుణంలో అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాతే… ప్రత్యేక రిజర్వేషన్లు సాధ్యమయ్యాయన్నారు. మైనారిటీలు, దళితులు, గిరిజనులు, పహారీలు తమ హక్కులను పొందుతారన్నారు. జమ్ము, కశ్మీర్ యూనియన్ టెరిటరీలో పహారీల జనాభా దాదాపు 6 లక్షలు ఉంటుందని అంచనా. వీరిలో 55 శాతం మంది హిందువులు కాగా.. మిగిలినవారు ముస్లింలు. కానీ ఇప్పటికే 10 శాతం ఎస్టీ కోటా ఉన్న గుజ్జర్, బకర్వాల్ వర్గాలు… పహారీలకు గిరిజన హోదాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలు, హిందువులు ప్రత్యేక వర్గాల నుండి కేవలం భాష ఆధారంగా కోటా పొందకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఎస్టీ కోటా కింద రాయితీలు పొందుతున్నవారికి నష్టం కలక్కుండా కొత్త చట్టాన్ని తెస్తామని అమిత్ షా వారికి హామీ ఇచ్చారు. కొందరు గుజ్జర్లు, బకర్వాల్లను రెచ్చగొడుతున్నారని ప్రజలకు వారి నిజ స్వరూపం తెలిసునన్నారు అమిత్ షా. జమ్మూ కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నిబంధనలైన ఆర్టికల్ 35A, 370ని 2019 ఆగస్టు 5న తొలగించబడినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. నాడు ఒక రాష్ట్రాన్ని రెండు యుటిలుగా విభజించారు. లడఖ్, జమ్మూ & కశ్మీర్ ఎన్నికైన అసెంబ్లీని కలిగి ఉంటుంది. లోయలో ఉన్న మొత్తం పరిస్థితులను బేరీజు వేస్తున్న కేంద్రం, త్వరలోనే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. అదే సమయంలో జమ్ము, కశ్మీర్ తిరిగి రాష్ట్ర హోదా కూడా పొందుతుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

నియోజకవర్గాల విభజన ఓటరు జాబితాలను ఖరారు చేసే ప్రక్రియ దాదాపు పూర్తయినందున వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ జమ్ము, కశ్మీర్‌ను పాలించిన మూడు కుటుంబాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని భావిస్తున్నానన్నారు. ఎవరి పేర్లను ప్రస్తావించకుండా… పీడీపీ ముఫ్తీలు, నేషనల్ కాన్ఫరెన్స్ అబ్దుల్లాలతోపాటు… కాంగ్రెస్ గాంధీ కుటుంబం లక్ష్యంగా ఆయన పరోక్ష విమర్శలు గుప్పించారు. జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రం, 2018లో చివరిసారిగా ఎన్నికైన ప్రభుత్వం అధికారంలో ఉంది. BJP భాగస్వామి, PDP మెహబూబా ముఫ్తీతో కలిసి ప్రభుత్వాన్ని నిర్వహించారు. పీడీపీ కంటే ముందుగా… నేషనల్ కాన్ఫరెన్స్ ఒకప్పుడు కేంద్రంలో బీజేపీ భాగస్వామిగా వ్యవహరించింది.
న్యాయమైన ఎన్నికల ద్వారా పంచాయతీలు, జిల్లా కౌన్సిల్‌లకు ఎన్నికైన 30,000 మందితో అధికారం ఇప్పుడు వికేంద్రీకరణ జరిగిందని… బహిరంగ సభలో అమిత్ షా చెప్పారు. గ్రామ స్థాయి ఎన్నికలు ఇప్పటికే నిర్వహించడంతో… గతంలో అభివృద్ధి కోసం కేంద్రం పంపిన డబ్బులన్నీ కొందరే దోచుకున్నారని, ఇప్పుడు అంతా సంక్షేమానికే వెచ్చిస్తున్నారన్నారు. మోదీ సర్కారు ఉగ్రవాదులపై తీసుకున్న పటిష్టమైన చర్యల కారణంగా భద్రతా మెరుగైందన్నారు. ఐతే… బీజేపీ చెబుతున్న విషయాలు గ్రౌండ్ లెవల్లో నిజం కాదని రుజువవుతున్నాయన్నారు పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ. కేవలం రిజర్వేషన్లను ఇచ్చి.. ఆ వర్గాలను విభజించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.

