గులాబీ పార్టీకి మునుగోడు టెన్షన్
ఎక్కడ చూసినా మునుగోడు ఎన్నికల చర్చే. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కొంటారన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో అధికారపార్టీ టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. నెల 21న బీజేపీలో చేరేందుకు రాజగోపాల్ రెడ్డి రంగం సిద్దం చేసుకుంటే… ఆయనకు మద్దతుగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు బీజేపీ సీనియర్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీలో చేరుతున్న వారిలో చండూర్ మండల సర్పంచ్ లు… తిప్పర్తి దేవేందర్ – (ధోనిపాముల), నందికొండ నర్సిరెడ్డి (నేర్మట), చొప్పరి అనురాధ వెంకన్న- (చొప్పరివారిగూడెం), కురుపాటి సైదులు (తుమ్మలపల్లి), మెండు ద్రౌపది వెంకట్ రెడ్డి -(కస్తాల), కర్నాటి ఊషయ్యలు (మునుగోడు మండల సర్పంచ్) ఉన్నారు. ఇక మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు తధ్యం అన్నారు ఈటల రాజేందర్. అధికార పార్టీ నుండి ప్రతిపక్షంలోకి ప్రజాప్రతినిధులు వచ్చి చేరుతున్నారంటే కేసీఆర్ పాలన పట్ల ఎంత వెగటు పుట్టిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ కు హుజూరాబాద్ లాంటి తీర్పు మరోసారి రుచిచూడాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.