NewsTelangana

నియోజక వర్గాల్లో కన్వీనర్లను నియమించిన బీజేపీ

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కాస్త నెమ్మదించిన బీజేపీ మళ్లీ దూకుడు పెంచింది. తెలంగాణలో 80 అసెంబ్లీ నియోజక వర్గాలకు పార్టీ కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నియమించారు. నియోజక వర్గంలోని పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడం, పార్టీ నేతల మధ్య విభేదాలు పరిష్కరించడం, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడం, స్థానిక సమస్యలను గుర్తించి పోరాటాలు చేయడం తదితర బాధ్యతలను కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లకు అప్పగించారు. వీళ్లు జిల్లా, మండల స్థాయి నేతల మధ్య సమన్వయం కూడా చేసుకుంటూ ముందుకు సాగుతారు. టీఆర్‌ఎస్‌ నేతలతో సీఎం కేసీఆర్‌ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే బీజేపీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.

కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లు ఎన్నికల్లో పోటీ చేయరు..

నియోజక వర్గాల కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని గెలిపించే బాధ్యతను వాళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థికి అన్ని వేళలా తోడుగా ఉంటూ.. అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే.. ఆయా నియోజక వర్గాల్లో బీజేపీ తరఫున పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు, బలమైన నాయకుల సూచన మేరకే కన్వీనర్లను, జాయింట్‌ కన్వీనర్లను నియమించినట్లు కాషాయ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 30 నియోజక వర్గాల కన్వీనర్లను గతంలో ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించిన 80 మంది కన్వీనర్లతో కలిపి మొత్తం 110 నియోజక వర్గాలకు బీజేపీ కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లను నియమించినట్లు అయింది.

సంస్థాగతంగా బలోపేతంపై బీజేపీ దృష్టి..

మిగిలిన నియోజక వర్గాలకూ కూడా త్వరలో కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లను నియమిస్తారని బీజేపీ రాష్ట్ర నాయకులు తెలిపారు. దాంతో పాటు త్వరలో కమిటీలు, సెల్స్‌ నియామకాలు చేపట్టి బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని పార్టీ వర్గాలు చెప్పాయి. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు కౌన్సిల్‌ సభ్యులను కూడా త్వరలో నియమిస్తారు. పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించాలని.. 28 రకాల కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయించింది.