బీజేపీ ఫస్ట్ లిస్ట్ కీలక స్థానాల్లో అభ్యర్థులు ఖరారు..!
వంద మందికి పైగా అభ్యర్థులతో బీజేపీ తొలి లిస్టును విడుదల చేయబోతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన బీజేపీ హైకమాండ్, వివాదం కాని సీట్లను తొలి జాబితాలో వెల్లడించనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి ప్రముఖులతో సహా దాదాపు 100 మందికి పైగా అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులకు పార్టీ టికెట్ నిరాకరిస్తుందోన్న వార్తల నడుమ ఇవాళ ఉదయం క్రికెటర్ గౌతం గంభీర్, మాజీ మంత్రి జయంత్ సిన్హా తాము ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని అన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో జరిగిన మారథాన్ రాత్రి సమావేశాల తర్వాత పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది.

హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాలైన యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, అలాగే ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అభ్యర్థులపై దృష్టి సారించింది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళపైనా పార్టీ ఫోకస్ పెట్టింది. తొలి జాబితాలో ప్రధాని మోదీ, అమిత్ షా ఉండబోతున్నారు. 1991 నుండి బిజెపికి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మరోసారి మోదీ పోటీ చేయబోతున్నారు. 2014, 2019లో ఇక్కడ మోదీ అద్భుత విజయాలు సాధించారు. మరోవైపు అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బరిలోకి దిగవచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేత చతురైన్ చావ్దాను ఓడించి 5.5 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్‌లోని లక్నో, గుణ-శివపురి నుండి వరుసగా పోటీ చేయవచ్చు. మొదటి జాబితాలో అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ పేరు ఉండొచ్చు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్ సభ బరిలో దిగబోతున్నారు.