ఖర్గేను, కుటుంబ సభ్యులను చంపేందుకు బీజేపీ కుట్ర
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన భార్య, కుటుంబ సభ్యులందరినీ హత్య చేసేందుకు బీజేపీ అభ్యర్థి పన్నాగం పన్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్‌చార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా సంచలన ఆరోపణలు చేశారు. ఈనెల 10న ఎన్నికలు జరగనుండగా… ఖర్గే ఒక ఆడియోను విన్పించాడు. ఇందులో కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ “ఖర్గే, అతని భార్య, పిల్లలను తుడిచిపెడతాను” అని కన్నడలో చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. “కాంగ్రెస్ పార్టీకి కన్నడిగుల సర్వతోముఖ ఆశీర్వాదం రావడంతో బెదిరిపోయి, కర్నాటక ఎన్నికల్లో పూర్తి ఓటమిని ఎదుర్కోనున్న బీజేపీ నేతలు ఇప్పుడు, ఖర్గేతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని సుర్జేవాలా ఆరోపించారు. “ప్రధానమంత్రి మౌనంగా ఉంటారని నాకు తెలుసు, కర్నాటక పోలీసులు, భారత ఎన్నికల సంఘం కూడా అలాగే ఉంటారు. కానీ కర్నాటక ప్రజలు మౌనంగా ఉండరు, తగిన సమాధానం ఇస్తారు” అని సుర్జేవాలా చెప్పారు.
ఐతే కాంగ్రెస్ ఆరోపణలపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విచారణకు హామీ ఇచ్చారు. “మేము ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటాం, మేము మొత్తం విషయాన్ని విచారిస్తాం, చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం.” అన్నారు. ఐతే, రాథోడ్ ఆ ఆరోపణలను ఖండించారు. ఆడియో నకిలీదని, తనను కించపరిచేందుకు కాంగ్రెస్ కల్పితమని అన్నారు. ఖర్గేకు గానీ, ఆయన కుటుంబానికి గానీ హాని తలపెట్టే ఉద్దేశం తనకు లేదని, ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. అదంతా అబద్ధం.. కొందరు ఫేక్ ఆడియో ప్లే చేస్తున్నారు.. ఓటమి భయంతో కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. చిత్తాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రియాంక్ ఖర్గేని హత్య చేస్తామని బెదిరించినందుకు 2022 నవంబర్ 13న బీజేపీ నాయకుడిని అరెస్టు చేసి, బెయిల్‌పై విడుదల చేశారు. ప్రియాంక్ ఖర్గేను కాల్చిచంపేందుకు తాను సిద్ధమేనని అప్పట్లో విలేకరుల సమావేశంలో చెప్పడంతో కలకలం రేగింది.

