కేటీఆర్‌కు జవాబు చెప్పాల్సిన పని బీజేపీకి లేదన్న బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
కేటీఆర్ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తండ్రిని అడ్డం పెట్టుకొని కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని అలాంటివారు తమపై మాట్లాడితే పట్టించుకోమని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా లో మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి కేటీఆర్ పై ఫైరయ్యారు. కేసీఆర్, కేటీఆర్ లు రాష్ట్రాన్ని పరిపాలించలేని దద్దమ్మలని అన్నారు. వారిచ్చే సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని తమకు ప్రజలే సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు. కేసీఆర్ కుటుంబానికి తొత్తులుగా ఉండేవారు, ఉండేటటువంటి వారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పనికిరారని గవర్నర్ తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమని కిషన్ రెడ్డి అన్నారు. కవులు, కళాకారులు లాంటి, వాళ్లని గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా పెట్టాలి గానీ కెసిఆర్ అడుగులకు మడుగులొత్తే వారిని పెట్టకూడదనీ కిషన్ రెడ్డి మండిపడ్డారు.

ప్రధాని రెండ్రోజుల టూర్ ఏర్పాట్లు పరిశీలించిన కిషన్ రెడ్డి
ఇందూరు, పాలమూరు బహిరంగ సభల్లో పాల్గొననున్న మోదీ
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో పాటు భారత హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. అక్టోబరు 1న మహబూబ్ నగర్ పట్టణంలో జరిగే బహిరంగ సభలో, 3వ తేదీన నిజామాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. తొలిరోజు పాలమూరు బహిరంగ సభలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్టోబరు 3వ తేదీన ఇందూరు పట్టణంలో బీజేపీ బహరంగ సభలో నరేంద్ర మోదీ ల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. 800మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రూ. 6 వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ను మోదీ గారు వర్చువల్ గా ప్రారంభిస్తారు. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా నాయకత్వంతో పాటు అధికారుల నుంచి సభాస్థలి గురించి పలు సూచనలు స్వీకరించామన్నారు బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతోంది-కిషన్ రెడ్డి
ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేలా జన సమీకరణ సహా ఇతర విషయాలపై పార్టీ నాయకులు, భారత ప్రభుత్వ అధికారులతో చర్చించామన్నారు. ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ నుంచి మొదలు ఆదిలాబాద్ వరకు బీజేపీ బలోపేతమైందన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా పెద్దఎత్తున మార్పులు వస్తున్నాయని… గిరిజనులతో పాటు స్థానిక ప్రజలు బీజేపీని ఆదరించి మద్దతిస్తున్నారన్నారు. బీజేపీపై విమర్శలు చేసే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. ప్రధాని తెలంగాణ పర్యటన గురించి ప్రశ్నించేందుకు కేసీఆర్ ఎవరని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. 17 సార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించలేదని దుయ్యబట్టారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని దగా చేశారని, 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడని నిప్పులు చెరిగారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లు ఇచ్చిందన్న కిషన్ రెడ్డి, కేటీఆర్‌కు జవాబు చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు.

