NewsTelangana

భైంసాను మహిషాగా మార్చేస్తాం

అధికారంలోకి వచ్చిన వెంటనే భైంసాను… మహిషాగా మారుస్తామన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆరంభం ముందు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. భైంసాను బీజేపీ దత్తత తీసుకుంటుందన్నారు. అల్లర్ల కేసులు ఎత్తేసి.. ఉద్యోగాలిస్తామన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల మయం చేశారన్నారు సంజయ్. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పేరుకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లూ, దళిత బంధు, రుణమాఫీ పథకాలనీ… పేదలకు కేసీఆర్ పథకాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా విద్య, వైద్య సౌకర్యం కల్పిస్తామన్నారు. నిలువనీడలేని వారందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు సంజయ్. రైతులకు పంట పరిహారం అందించి ఆదుకుంటామన్నారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సంజయ్. కేసీఆర్‌కు మూడింది…. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని జోస్యం చెప్పారు.

మతవిద్వేషాలు రగిలించే ఎంఐఎం నాయకులు ఎక్కడైనా తిరగొచ్చు… హిందూ దేవతలను కించపర్చే మునావర్ ఫారుఖీ లాంటి వాళ్లు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చట… దేశం కోసం, ధర్మం కోసం హిందు ధర్మాన్ని కాపాడే బీజేపీ మాత్రం భైంసాలో సభలు పెట్టుకోవద్దంటున్నారన్నారు సంజయ్. భైంసాలో మత కల్లోలాల సమయంలో బాధితుల పక్షాన పోరాడిన హిందూవాహిని తమ్ముళ్ల పోరాటం భేష్ అన్నారు. భైంసాకు రావాలంటే వీసా తీసుకోవాలా? బైంసాలో పచ్చ జెండా మాత్రమే ఎగరేస్తామని ఉర్రూతలూగిన ఎంఐఎం ఉన్న పాతబస్తీకి పోయి కాషాయ జెండాను రెపరెపలాడించామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ 5 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణలో ప్రతి వ్యక్తిపై రూ.1.2 లక్షల అప్పు మోపాడని… నరేంద్రమోదీ ప్రభుత్వం గత నెలలో ఒకేసారి 75 వేల మందికి, ఈ నెలలో 70 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారన్నారు. ఇక్కడ కేసీఆర్ ఒక్క ఉద్యోగమియ్యలే….సమస్యల పరిష్కారం కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ధర్నా చేస్తే కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడని విమర్శించారు సంజయ్.