అవినీతి, నియంతృత్వ బీఆర్ఎస్ కుటుంబ పాలనపై తెలంగాణ ప్రజాకోర్టులో బీజేపీ చార్జ్ షీట్
పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలు, వాగ్ధానాల అమలులో వైఫల్యాలపై ప్రజాకోర్టులో బిజెపి చార్జ్ షీట్. ప్రజలే న్యాయనిర్ణేతలు.
బీఆర్ఎస్ అవినీతి :
సుదీర్ఘ ఉద్యమాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. 2014లో తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి విలయతాండవం చేస్తోంది. ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఏదో రకమైన అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియా అన్నింట్లో బీఆర్ఎస్ నాయకులకు సంబంధాలు ఉన్నాయి, ముడుపులు ముడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ నీరందించే మిషన్ భగీరథ కార్యక్రమంలో అంతా అవినీతికంపే. అప్పటికే ఉన్న వాటర్ ట్యాంకులకు రంగులేసి కొత్త ట్యాంకర్లుగా చూపించి ప్రభుత్వ డబ్బును కాజేశారు. మిషన్ కాకతీయ పేరుతో రూ. 30 వేల కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం.. అందులో అధిక సొమ్ము బీఆర్ఎస్ నాయకుల జేబులోకే పోయింది.
తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందిస్తామన్న బీఆర్ఎస్ వాగ్ధానం మేరకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతికంపు. ప్రాజెక్టును రీడిజైన్ చేసి, అంచనాలు పెంచి, 40 వేల కోట్ల రూపాయల అంచనాను లక్షా 40 వేల కోట్లకు పెంచి, తమ వాళ్లకే కాంట్రాక్టులు అప్పగించి, ముఖ్యమంత్రి కుటంబసభ్యులే ప్రత్యక్షంగా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కారణంగా వంద సంవత్సరాల కోసం నిర్మించిన ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర కూలిపోయే స్థితికి రావడం తెలంగాణ ప్రజల రక్తమాంసాలను తాగినట్టుగానే మేం భావిస్తున్నాం. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ, మెయింటెనెన్స్ లో రాష్ట్రం విఫలమైందని కేంద్ర కమిటీ నివేదిక అందించింది.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు పేద ప్రజల కోసం నిర్దేశించిన కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితబంధు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వంటి అన్నింటిలో లంచాలకు తెగబడుతున్నారు. దళితబంధు కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే 30 శాతం కమీషన్ తింటున్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా అంగీకరించిన వార్తలు మీడియాలో వచ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి కూతురే ఢిల్లీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాంతో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు అనేక రిమాండ్ రిపోర్ట్ లలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ బీఆర్ఎస్ నాయకులకు పెద్ద ఆదాయ వనరుగా మారింది. చెరువులు, కుంటలు, పార్కులు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములు, కాందిశీకుల భూములు… ఒక్కటేమిటి అన్ని రకాల భూములపై కన్నేసిన బీఆర్ఎస్ నాయకులు వాటి కబ్జాలకు పాల్పడుతున్నారు. ల్యాండ్ మాఫియాలో బీఆర్ఎస్ నిండా మునిగి ఉంది. అవినీతిని ప్రశ్నించిన సామాన్యులపై, పార్టీ కార్యకర్తలపై, నేతలపై భౌతిక దాడులు చేయటం, పోలీసులచే అక్రమ కేసులు పెట్టించి వేధించడం బీఆర్ఎస్ కు సర్వసాధారణమైంది. అవినీతికి ఎవరు పాల్పడినా 040-23452933 నంబర్‌కు కాల్ చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ వరంగల్ సభలో చెప్పారు. కానీ ఆ నెంబర్‌కు డయల్ చేస్తే.. అసలు మనుగడలోనే లేదని చెప్తోంది. ఇది యావత్ తెలంగాణ ప్రజలకు జరిగిన మోసం.
రైతులకు మోసం :
- రైతు రాజ్యం.. రైతును రాజును చేస్తమన్నడు, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వాగ్ధానం చేసిండు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లిస్తానని చెల్లించలేదు. అప్పులబాధతో గత తొమ్మిదిన్నరేళ్లలో 7,800 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి.
- రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిండు. రుణమాఫీ డబ్బులు బ్యాంకు వడ్డీలకే సరిపోయినయ్.
- వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్తూనే ఉన్నడు. ఇది వాస్తవం కాదు.
- ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిండు. గత తొమ్మిదేండ్లలో అదనంగా సాగునీరు అందింది లేదు.
- తెలంగాణలోని ప్రతి రైతు భూమిలో భూసార పరీక్షలు ప్రభుత్వమే నిర్వహిస్తుందని వాగ్ధానం చేసిండు. దేశం మొత్తంలో ఇప్పటివరకు 23 కోట్ల క్షేత్రాల్లో భూసార పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో మాత్రం ఎక్కడా చేసింది లేదు.
- తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా (విత్తన భాండాగారం) తయారుచేస్తానని, యావత్ భారతదేశంలో తెలంగాణలో ఉత్పత్తయ్యే విత్తనాలను మార్కెటింగ్ చేసే బాధ్యత ప్రభుత్వం స్వీకరిస్తుందన్నడు. చేయలేదు.
- వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తెలంగాణ వ్యాప్తంగా పరిశోధ కేంద్రాలు ఏర్పాటు చేసి, తెలంగాణకు అనుగుణమైన సాగుపద్ధతులపై ఆ పరిశోధనలు జరుగుతాయని హామీ ఇచ్చిండు. అసలు పరిశోధన కేంద్రాలే ఏర్పాటు చేయలే.
- కల్తీలేని, నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వమే అందిస్తుందని, ఎరువుల బ్లాక్ మార్కెట్ ను నిరోధించి, సకాలంలో ఎరువులు అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీఆర్ఎస్.. రాష్ట్రంలో మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించటం.. రైతులకు అత్యవసరమైన ఎరువులను అసలే విక్రయించకుండా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు.
- 2018-19 నుంచి రైతాంగానికి సాగుకు సరిపడా ఎరువులు ఉచితంగా పంపిణీచేస్తామని హామీ ఇచ్చిండు. కేసీఆర్ పుట్టిందే అందుకే అన్నడు. ఉచితంగా బస్తా యూరియా కూడా ఇయ్యలే.
- ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తానని మాటలు చెప్పిండు.. రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడించింది. పరిహారం మాత్రం ఇవ్వలేదు.
- 2014 మేనిఫెస్టోలో వాగ్ధానం చేసినట్లు ఎంఐఎస్ (మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్) పథకాన్ని అమలు చేయడం లేదు. ఎనిమిదేండ్లలో ఏ ఒక్క పంటకు కూడా బోనస్ ఇవ్వలేదు.
- ధరణి పోర్టల్ రైతుల పాలిట వరం అన్నడు. కాని, రైతుల మధ్య గెట్టు పంచాయితీలు పెరిగినయ్. చాలామంది భూములు గల్లంతు అయినయ్. కబ్జాలు పెరిగినయ్. రాష్ట్రంలో భూ సర్వేలు చేయకుండా ధరణి పేరుతో భూములు కబ్జా పెట్టే ప్రయత్నం చేసే భూ బకాసురులకు అండగా నిలబడ్డారు.
నీటి పారుదల రంగం
- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చిండు. ఇంతవరకు కొత్త ఆయకట్టుకు నీరందింది లేదు.
- దక్షిణ తెలంగాణ వరదాయనిగా, మహబూబ్‌నగర్ వంటి కరువు సీమలో నీటిని పారించే ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోన్న పాలమూరు రంగారెడ్డి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తిచేసి పాలమూరు జిల్లాలో పచ్చదనాన్ని నింపి వలస బాధలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిండు. ఇంతవరకు పూర్తి చేయలేదు.
- జూరాల, పాకాల ఎత్తిపోతల పథకం చేపడుతామని హామీ ఇచ్చి, ఇంతవరకు చేపట్టలేదు.
దళితులకు దగా:
- తెలంగాణ స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడేనని, ప్రజలకు కాపలా కుక్కలెక్క ఉంటానన్నడు. తన మాటంటే మాటే, లేకుంటే తల నరుక్కుంటానని చెప్పిండు. దళితుడిని ముఖ్యమంత్రి చెయ్యలే, తల నరుక్కోలే, కాపలాలేడు. దళితులను దగా చేసిండు.
- భూమి లేని దళితులకు వ్యవసాయానికి అనుకూలంగా ఉండేలా 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి భూములు ఇయ్యలేదు. దగా చేసిండు. రాష్ట్రంలో సుమారు 17 లక్షలకు పైగా దళిత కుటుంబాలకు మోసం చేసిండు.
- సక్రమంగా దళితుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో కనీసం 15 శాతం కూడా ఖర్చు చేయకుండా దారిమళ్లించిండు.
- మండలానికి ఒక అంబేద్కర్ వికాస్ భవనం, జిల్లాకొక స్టడీసర్కిల్, దళిత విద్యార్థులకు ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్ ఇస్తనని చెప్పి మాట తప్పిండు. దళితులను ఉద్యోగాలకు దూరం చేసిండు.
- ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి కోటి రూపాయల వరకు ఆర్థికసాయం చేస్తామన్న హామీని తుంగలో తొక్కి మోసం చేసిండు.
- దళితుల సంక్షేమానికి రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో హామీఇచ్చి, చెయ్యకుండా మోసం చేసిండు.
- ఎస్సీలపై జరిగే దాడులకు సంబంధించిన కేసుల విచారణకు ప్రతీ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు చేస్తానన్నడు. చేయలేదు.
గిరిజనులు :
- పోడు భూముల విషయంలో గిరిజనులు, గిరిజనేతరులకు పట్టాలు ఇస్తనని హామీ ఇచ్చిండు. పోడు ప్రాంతాల్లో కుర్చీ వేసుకుని మరీ అక్కడికక్కడే సమస్య పరిష్కరిస్తమని చెప్పిండు. ఇంతవరకు పూర్తిస్థాయిలో పట్టాలు ఇచ్చింది లేదు.
- గిరిజనులకు 12% రిజర్వేషన్లు అమలు చేస్తామని, 3 ఎకరాల భూమి ఇస్తామని కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిండు.
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు నోడల్ ఏజెన్సీల ద్వారా ఖర్చు చేస్తామని చెప్పి ఇంత వరకు చేయలేదు.
- మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఎస్టీలకు గిరిజనబంధు ఇస్తామని మాట తప్పిండు. ఇది గిరిజనులకు జరిగిన మరో మోసం.
- గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పదివేల కోట్ల రూపాయల ఋణాలు ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పిండు.
- ప్రతీ జిల్లాకు ఒక గిరిజన భవనం, ప్రతీ గిరిజన గ్రామ పంచాయతీకి రూ. 50 లక్షలు ఇస్తానని వాగ్ధానం చేసిండు. ఇయ్యకుండా దగా చేసిండు.
బీసీలకు ద్రోహం :
- బీసీల సమగ్ర అభివృద్ధి కోసం రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తామని, బీసీ కార్పొరేషన్ కు ఏటా వెయ్యికోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిండు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా బీసీలకు అన్యాయం చేసిండు. ఎంబీసీ కుల వర్గీకరణ చేయలేదు.
- గొల్లకురుమలకు గొర్ల పంపిణీలో అవకతవకలు జరిగాయి. డబ్బులు కట్టించుకుని సంవత్సరం కావస్తున్నా ఇంకా పంపిణీ చేయకుండా అన్యాయం చేసిండు.
- చేనేత కార్మికులకు భద్రతానిధిని ఏర్పాటు చేస్తానన్నడు. చేనేత వస్త్రాలను సర్కారే కొంటదని చెప్పిండు. భద్రాతానిధి లేదు, కొనటంలేదు. ఇది మరో మోసం.
- చేనేత కార్పొరేషన్, పవర్‌లూమ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తామని ప్రకటించి, అసలు ఆ మాటే మరిచిండు.
- రజకులకు గ్రామాలలో ధోభీ ఘాట్ లు ఏర్పాటు సహా రజక ఫెడరేషన్ పెట్టి ప్రతి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థికసాయం అందజేస్తానని హామీలు గుప్పించిండు. తూతూ మంత్రంగా ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడా ధోబీ ఘాట్లు పెట్టలేదు. ఆర్థిక సాయం అందించింది లేదు.
- 2014 ఎన్నికల మేనిఫెస్టోలో నీరాను సాఫ్ట్ డ్రింక్ లా గుర్తించి గ్లోబల్ బ్రాండ్ చేసి మార్కెటింగ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు హామీ ఇచ్చి దోఖా చేసింది. అన్ని జిల్లాల్లో నీరా ఉత్పత్తి, సరఫరాలను విస్తరిస్తామని మాట తప్పిండు.
- రాష్ట్ర వ్యాప్తంగా తాటివనాలు, ఈతవనాల పెంపు కోసం ప్రతి గ్రామంలో ఐదు ఎకరాలు ఇస్తనన్నడు. ఇయ్యకుండా మోసం చేసిండు. గీత కార్మికులకు మోటార్ సైకిళ్ళు ఇస్తనన్నడు. ఇయ్యలేదు, బీమా చేస్తానని నమ్మించి మాట తప్పిండు.
- మత్స్యకార్మికులకు సమీకృత చేపల మార్కెట్లు ఏర్పాటు చేస్తనని మాట తప్పిండు.
విద్యారంగం ఆగం:
- కేజీ నుంచి పీజీ (KG to PG) వరకు ఉచిత నిర్భంధ విద్య అమలు చేస్తామని ఉద్యమ సమయంలోనూ, ఎన్నికల మానిఫెస్టోల్లోనూ ఈ ప్రస్తావన ప్రధానంగా చూపెట్టిన టీఆర్ఎస్ హామీని నెరవేర్చలేదు.
- ఐఏఎస్ తరహాలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తీసుకొని వస్తామన్నడు. చెయ్యలేదు.
- జిల్లాకో మెడికల్ కాలేజీ అని ఘనంగా చెప్పుకుంటున్నా.. పాత గోడౌన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
- జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ వికాస కేంద్రాలు, స్టడీ సర్కిల్స్ ఏర్పాటు హామీ ఇచ్చిండు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యాలతో ఇ-లైబ్రరీల నిర్మాణం చేస్తానని వాగ్ధానం చేసిండు. ఇంతవరకు అతీగతి లేకుండా పోయింది.
- తన మనవడు తినే భోజనాన్నే విద్యార్థులకు పెడతమని కేసీఆర్ చెప్పిండు. కాని, రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో పురుగులు, బల్లులు, బొద్దింకలతో కూడిన నాసిరకం ఆహారం తిని అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారు.
- రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి గదిలో నలుగురు విద్యార్థులు మాత్రమే ఉంటారని, అటాచ్డ్ బాత్రూమ్ తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అమలు చేయలేదు.
- ప్రభుత్వ స్కూళ్లలో పోషకాహార నిపుణుల సలహాల మేరకు మెనూ రూపొందిస్తామని చెప్పిండు. కాని చాలాచోట్ల కలుషిత ఆహారంతో విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారు.
- గవర్నమెంట్ స్కూళ్లలో గ్రంథాలయంతో పాటు ఈ-లైబ్రరీ, ఇంటర్నెట్ సౌకర్యం, వ్యాయామం కొరకు ప్లే గ్రౌండ్, రన్నింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిండు. కాని, నెరవేర్చలేదు. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
- తెలంగాణలో విశ్వవిద్యాలయాలకు తగిన గ్రాంట్లు ఇచ్చి, వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిండు. ఇంతవరకు అభివృద్ధి చేయలేదు.
- రాష్ట్రంలోమహిళా విశ్వవిద్యాలయం, వెటర్నరీ యూనివర్శిటీ, హార్టికల్చర్ యూనివర్శిటీ, మైనింగ్, ట్రైబల్ యూనివర్శిటీ, తెలంగాణ కల్చరల్ యూనివర్శిటీల స్థాపనకు కృషి చేస్తానన్నడు. చేయనేలేదు.
- విద్య అన్ని దశల్లో కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల క్రమబద్ధీకరణ కోసం విద్యాప్రమాణాల పెంపుదల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామన్నడు. ఏర్పాటు చేయలేదు. ఫీజుల దోపిడీ కొనసాగుతూనే ఉంది.
- విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలను అనుసంధానం చేస్తూ మానవ వనరుల అభివృద్ధి చేస్తానన్నడు. చేయలేదు.
- విద్యావంతులు మేధావులు, వైస్ చాన్స్ లర్లు, ప్రొఫెసర్లు, టీచర్లు, లెక్చరర్లతో సెమినార్లు పెట్టి చర్చలు నిర్వహించి విద్యావిధానం రూపొందిస్తే ప్రభుత్వం అమలు బాధ్యత స్వీకరిస్తుందని అన్నడు. విద్యావ్యవస్థే భ్రష్టు పట్టింది.
- ప్రతీ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రతీ నియోజకవర్గం లో పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మిస్తామని చెప్పిండు. నిర్మించలేదు. ఇది మరో దగా.
- అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించడమే కాకుండా నూతన విద్యావిధానాన్ని తీసుకువస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నీటిమీద రాతగానే మిగిలింది.
- పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క యూనివర్శిటీలో కూడా బోధనా సిబ్బందిని నియమించకపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, వివక్షకు నిదర్శనం.
వైద్య రంగంలో హామీల బుట్టదాఖలు :
- కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌ను ప్రవేశపెట్టినా.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. దీనితో అనేక మంది పేదలు కరోనా సమయంలో ఆర్థికంగా నష్టపోయారు. ఇది తెలంగాణ సర్కారు ఘోర వైఫ్యల్యం.
- కరోనా సమయంలో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను నిలువునా దోచుకుంటున్నా సర్కారు పట్టించుకోలేదు. రూ.2,800 విలువ చేసే రెమ్‌డెసివర్ ఇంజెక్షన్‌ను రూ.40 వేల నుంచి రూ.1 లక్ష వరకు కార్పొరేట్ ఆసుపత్రులు అమ్ముకోవడంతో అనేక కుటుంబాలు వీధినపడ్డాయి. కరోనాను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చకపోవడం వల్ల పేద, మధ్యతరగతి రోగులు తమ ఆస్తులను అమ్ముకొని కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులకు లక్షల్లో బిల్లులు కట్టారు.
- ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులకు ధీటుగా చేస్తామన్న హామీ నెరవేరలేదు. హైదరాబాద్ చుట్టూ నాలుగు కార్పొరేట్ ఆసుపత్రులు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. కాని నెరవేర్చలేదు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులు మందులను బయటే కొంటున్నారు. రోగనిర్ధారణ పరీక్షలను ప్రైవేటు పరీక్షా కేంద్రాలలో చేయించుకుంటున్నారు.
- మండలానికో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి 24 గంటలు వైద్యసేవలు అందిస్తాం, మెడికల్ ఆఫీసర్లను నియమిస్తాం అన్నడు. నియోజకవర్గానికో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపర్చినా.. పదేండ్లు గడిచినా ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు.
- ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి కట్టిస్తా అన్నడు. నిర్మించలే.. దగా చేసిండు.
- ఉస్మానియా ఆసుపత్రిని అధునీకరించి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తామన్నడు. ఇంతవరకు అధునీకరించింది లేదు.
- మెడికల్ ఆఫీసర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తానన్నడు. పూర్తిస్థాయిలో మెడికల్ ఆఫీసర్ల నియామకం జరగలేదు.
- ఆయుర్వేద, యునాని లాంటి సంప్రదాయ వైద్య పథకాలు అమలు చేయబడుతాయని అన్నడు. పథకాలే లేవు.
- వ్యాధిని నయం చేసే వైద్య పద్ధతులే కాకుండా, వ్యాధికారకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, వ్యాధులు రాకుండా అవగాహన కల్పిస్తామన్నడు. ఎక్కడా ప్రజల్లో అవగాహన కల్పించలేదు.
మహిళలకు అన్యాయం :
- డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రూ. 10 లక్షల ఋణాలు ఇస్తానని, మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తనన్నడు. ఇంతవరకు ఋణాలు ఇచ్చింది లేదు. బ్యాంకులు ఏర్పాటు చేసింది లేదు.
- రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తామని వాగ్ధానం చేసి, ఆ మాట కాగితాలకే పరిమితమైంది.
- మహిళల రక్షణ తమ ధ్యేయమని చెప్పాడు. తెలంగాణ వచ్చాక లక్షమంది మహిళలు అనేక అఘాయిత్యాలకు గురయ్యారని స్వయంగా ఎన్ సీఆర్ బీ రిపోర్ట్ తెలిపింది. మహిళలకు రక్షణ లేదు.
నిరుద్యోగులకు మోసం :
- ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నడు, ఇంట్లో చదువుకున్నవారు ఉంటే ఇద్దరికీ ఉద్యోగం ఇస్తానన్నడు. కనీసం ఊరికొక ఉద్యోగం కూడా ఇయ్యలే, పోలీసు శాఖలో తప్ప ఇతరశాఖలలో నియామకాలేలేవు. నిరుద్యోగులను తొమ్మిదిన్నరేళ్లుగా వేధిస్తున్నడు.
- TSPSC groups పరీక్షల నోటిఫికేషన్లు తొమ్మిది సంవత్సరాల తరువాత 2022లో ఇచ్చిండు. కాని అది కూడా అనేక ఆరోపణలతో రెండుసార్లు రద్దైంది. నిరుద్యోగులకు పూడ్చలేని నష్టం జరిగింది. కేసీఆర్ సర్కారు నిరుద్యోగులకు తీరని ద్రోహం చేసింది. సర్కారు వైఖరితో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నరు.
- 2018 ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు 3016/- భృతి ఇస్తనని హామీ ఇచ్చిండు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తనన్నడు. నిరుద్యోగులకు భృతి ఇయ్యలేదు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇచ్చిందీ లేదు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కనీసం నిరుద్యోగ భృతి గురించి ముచ్చటే లేదు.
- పదేండ్లలో ఉపాధ్యాయ ఖాళీల్లో పూర్తిస్థాయిలో భర్తీ చెయ్యలేదు. పాఠశాలల్లో టీచర్లు లేక విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగింది.
- పది సంవత్సరాలుగా ఒకే ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిండు. అది కూడా ఎన్నికల కోడ్ తో వాయిదా పడింది.
ఉద్యోగులను దగా చేసిన సర్కారు :
- ఉద్యోగులకు నెల మొదటి రోజున జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు ఏ రోజు వస్తయో తెలియదు. డీఏలు టైంకు ఇవ్వడం లేదు. పీఆర్సీ ఇవ్వడం లేదు.
- ఉద్యోగులకు పదవీ విరమణ జరిగిన రోజునే అన్ని రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి గౌరవంగ ఇంట్లో దింపుతమని హామీ ఇచ్చిండు. ఆ గౌరవం ఒక్క ఉద్యోగికి కూడా ఇయ్యలే, ఇంట్లో దింపలే.
- తెలంగాణ వచ్చినంక ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ఉండదు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని , 2014 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో, అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి మాట తప్పిండు.
- ఆర్టీసీ ఉద్యోగులకు సీసీఎస్, వారి కుటుంబ సభ్యులకు ఉచిత బస్‌పాస్‌లు, ఉచిత వైద్య సౌకర్యం, గృహ రుణం ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ఆర్టీసీ కార్మికులకు ఇంతకుముందు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స చేయించుకునే అవకాశం ఉండేది. దాన్ని రద్దు చేసి కేవలం దుర్గాబాయ్ దేశ్ ముఖ్, నిమ్స్ ఆసుపత్రులలో మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇతర దవాఖానాల్లో చేరితే ఖర్చులు సొంతంగా భరించుకోవాల్సిందే. ఇది ఆర్టీసీ కార్మికులకు జరిగిన అన్యాయం.
సింగరేణి
- సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలతో పాటు కారుణ్య నియామకాలు ఇస్తామన్నాడు. ఇయ్యకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నడు.
- సింగరేణి ఉద్యోగుల్లో సొంతిల్లు లేనివారికి రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తానన్నడు. కేవలం ఇది సింగరేణి ఎన్నికల స్టంట్ మాత్రమే.
- సింగరేణిలో నిమ్స్ లాంటి ఆసుపత్రిని ఏర్పాటు చేసి కార్మికులు, వారి కుటుంబాలకు ఉన్నత వైద్యం అందిస్తామని ప్రకటించిండు. ఏర్పాటు చేయలేదు.
- కొత్తగూడెం, రామగుండం, భూపాలపల్లి, శ్రీరాంపూర్ లలో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నడు. చేయలేదు.
NRI లకు :
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉపాధి కోసం ముంబై, దుబాయికి వలసలను నివారించేలా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతామని కేసీఆర్ హామీ ఇచ్చిండు, కాని, చేపట్టలేదు. మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల నుంచి వలసలు ఆగలేదు.
- ఎన్ఆర్ఐల కోసం రూ. 500 కోట్లతో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి తెలంగాణ నుంచి వలస బతుకులకు ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చిండు. మాట నిలుపుకోలేదు.
- విదేశాలకు వెళ్లేవారి కోసం విదేశీ భవన్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు. చేయలేదు.
విద్యుత్ రంగం
- కొత్తగా 10 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నాడు. ఒక్కటి కూడా పూర్తి చేయలేదు.
- మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు. కాని, విద్యుత్ కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సివస్తోంది. వారికి విద్యుత్ బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది.
- అదనపు విద్యుత్ కేంద్రాలను జెన్ కో ఆధ్వర్యంలోనే నిర్మిస్తుందని, ఫలితంగా లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు.
- 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పి అప్ గ్రెడేషన్ పేరుతో వేల రూపాయల బిల్లు వేస్తూ, పేద, మధ్యతరగతి ప్రజలపై భారం వేసి ఆర్థికంగా నష్టపరుస్తున్నడు.
- హైటెన్షన్ వైర్లను భూమిలోంచి వేసి ప్రజలకు కరెంట్ షాకు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చి నిలుపుకోలేదు.
పారిశ్రామిక రంగం:
- అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పాడు. ఇప్పటివరకు తెరవలే. సుమారు 40 వేలమంది రైతులకు జీవనోపాధి లేకుండాపోయింది. కార్మికులకు అన్యాయం చేసి రోడ్డున పడేసిండు.
- అజాంజాహీ మిల్స్, ఆల్విన్, హెచ్ఎంటీ, మొదలగు పరిశ్రమలను పునరుద్ధరిస్తామని చెప్పాడు. ఇంతవరకు చేయలేదు.
- కాగజ్ నగర్ నుంచి మణుగూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని గాలిమాటలు చెప్పిండు.
పర్యాటక రంగానికి ఆదరణ కరువు:
- ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధి సమన్వయ మండలి ఏర్పాటు చేస్తామన్నాడు. చేయలేదు.
- తెలంగాణలో కొత్త మ్యూజియంలు ఏర్పాటు చేయడంతో పాటు కేవ్ టూరిజం, ఎకోటూరిజం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిండు. ఇంతవరకు ఏర్పాటు చేయలే.
- ఐదేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలతో పర్యాటక రంగంలో దశలవారీగా మౌలిక వసతులు కల్పిస్తామన్నడు. చేయలేదు.
- పర్యాటక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి, పదో తరగతి పైన చదువుకున్నవారికి పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నడు. చేయలేదు.
- కేస్లాపూర్, సలేశ్వరం మొదలగు గిరిజన జాతరలను రాష్ట్ర పండుగలుగా గుర్తిస్తామని చెప్పాడు. గిరిజనులకు చేసిన మరో మోసం ఇది.
- ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్న జలపాతాలను అభివృద్ధి చేస్తానన్నడు. చేయలేదు.
- వరంగల్ లోని పోతన ప్రాజెక్టు, ఆదిలాబాద్ లోని కొమురం భీం ప్రాజెక్ట్, నల్లగొండలోని బుద్ధవనం ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానన్నడు. ఎటువంటి శ్రద్ధ చూపించలేదు.
- తెలంగాణలోని మ్యూజియంలను అభివృద్ధి చేస్తూ, కొత్తవాటిని ఏర్పాటు చేస్తానన్నడు. అవేవీ చేయలేదు.
టీవీ-చలనచిత్ర పరిశ్రమ :
- సినిమా-మాస్ కమ్యూనికేషన్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి, ఏర్పాటు చేయకుండా చేతులు దులుపుకున్నాడు.
- రూ. 100 కోట్లతో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పిండు.
గ్రామీణ రంగం:
- ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తానన్నడు, ప్రతి గ్రామంలో సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేస్తామన్నాడు. ఏర్పాటు చేయలేదు.
- ప్రతి మండల కేంద్రంలో వెటర్నరీ ఆసుపత్రులు, వెటర్నరీ కాంపౌండర్ ను నియమిస్తానని, అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిండు. ఏర్పాటు చేయలేదు.
- మండల కేంద్రాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న హామీ అమలుకు దిక్కులేకుండా పోయింది.
పట్టణాలు:
- పట్టణాలలో సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేస్తామన్నాడు. చేయలేదు.
- ప్రతి గ్రామాన్ని సమీప పట్టణానికి కలుపుతూ డబుల్ రోడ్డు వేస్తానన్నాడు. వేయలేదు.
- ప్రతి మున్సిపాలిటీలో మరియు హైదరాబాద్ లో రూ. 2 కోట్లతో కళ్యాణ మండపాలు నిర్మిస్తామని చెప్పి దోఖా చేసిండు.
- నిజామాబాద్ లో చెరుకు పరిశోధన కేంద్రం, పాలమూరులో చేపల పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఏర్పాటు చేయలేదు.
- వరంగల్ లో కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తానన్నాడు. నిర్మించలేదు.
- ప్రతి జిల్లా, డివిజన్లలో కల్చరల్ ఆడిటోరియంలు నిర్మిస్తామని వాగ్ధానం చేసి మాట తప్పిండు.
- సాహిత్య, సంగీత, లలిత కళలు జానపద అకాడమీ ఏర్పాటు చేస్తామని, అమలు చేయకుండా కళాకారులను సైతం మోసం చేసిండు.
ధార్మిక రంగం:
- ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయాల నిర్వహణ చేస్తామని, రాష్ట్రంలో కబ్జాలకు గురైన దేవాలయాల భూములను కబ్జాదారుల చెరనుంచి కాపాడుతామని చెప్పిండు. బీఆర్ఎస్ పాలనలో దేవాలయ భూముల కబ్జాలు మరింత రెట్టింపు అయ్యాయి.
- భద్రాచలంను టెంపుల్ సిటీగా చేస్తానని, భద్రాచలం దేవాలయానికి రూ. 100 కోట్లు కేటాయిస్తానని ప్రకటనలు గుప్పించిండు. వేములవాడ ఆలయానికి ఏటా రూ. 100 కోట్లు ఇస్తామని ప్రకటించిండు. ఇంతవరకు ఆ హామీలు నిలబెట్టుకోలేదు.
విశ్వనగరం కాదు… విషాద నగరం:
- కాలుష్యకోరల్లో చిక్కిన మూసీనదిని గుజరాత్‌లోని సబర్మతి నది తరహా ప్రక్షాళన చేస్తామని చెప్పిండు. మూసీనదిని బ్యూటిఫికేషన్ చేసి, టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దుతామని వాగ్ధానం చేసిండు. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మూసీ మురికిపోలే, కంపుపోలే.
- హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణ చేస్తానన్నడు. పునరుద్ధరణ జరగలేదు. కాని, కబ్జాలు మాత్రం జరుగుతున్నాయి.
- జంట నగరాలను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతానన్నడు. 200-300 ఎకరాల్లో కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామన్నడు. ఇంతవరకు ఏర్పాటు చేయలేదు.
- హైదరాబాద్ లో వరద బాధితులకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇస్తానన్నడు. కొద్దిమందికే ఇచ్చి చేతులు దులుపుకున్నడు.
- రూ. 67 వేల కోట్లతో హైదరాబాద్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిండు. చిన్న వర్షం పడినా హైదరాబాద్ నగరం వరదనీటిలో మునుగుతోంది, ఓపెన్ మ్యాన్ హోల్స్ లో పడి ఎంతోమంది చనిపోయారు. దీనికి నాలాలు, చెరువుల కబ్జాలే ప్రధాన కారణం.
- జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు డబుల్ బెడ్ రూమ్స్ కట్టిస్తానన్నడు. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, ఇంతవరకు కట్టించలేదు.
వృద్ధులు :
- రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పొందేందుకు వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించి, అర్హులైన వారందరికీ పెన్షన్ ఇస్తామని హమీ ఇచ్చిండు. అక్కడక్కడ తప్పితే కొత్తగా నమోదైన పెన్షనర్లకు ఆసరా కల్పించింది లేదు. అర్హత కలిగిన వారికి పెన్షన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నడు.
- పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తానని చెప్పి మాట తప్పిండు.
కార్మికులు:
- రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి ఆ యూనిట్ల బాధ్యత ఐకేపీ యూనిట్లకు ఇస్తానని చెప్పాడు. చేయకుండా మోసం చేసిండు.
- నిజామాబాద్ లో బీడీ కార్మికుల కోసం బీడీ భవన్ కట్టిస్తానని హామీ ఇచ్చిండు. కట్టించలేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తానన్న హామీ నెరవేర్చలేదు.
- 2018 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా బయ్యారం ఫ్యాక్టరీ పెడతామని బహిరంగ సభలో చెప్పి ఏర్పాటు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిండు.
తెలంగాణ విమోచన దినోత్సవం
- ఉద్యమకాలంలో సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అప్పుటి ఉమ్మడి సర్కారును డిమాండ్ చేసి .. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపనన్నడు. నిజాం గొప్ప రాజు అన్నడు. ఇది నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాటయోధులకు జరిగిన అవమానం.
- కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ, ఆ వేడుకలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించినా హాజరుకాలేదు. ప్రతిసారి నిజాం వ్యతిరేక పోరాటాన్ని అవమానించిండు కేసీఆర్.
తెలంగాణ ఉద్యమకారులు :
- అమరవీరుల కుటుంబాలు అందరికీ ఇళ్లు కట్టిస్తానన్నడు, రూ. 10 లక్షలు ఇస్తనన్నడు, వ్యవసాయ భూమి, ఇంటి జాగా ఉన్నవాళ్లకు రూ. 5 లక్షలు ఇస్తనని చెప్పి కొద్ది మందికే ఇచ్చి చేతులు దులుపుకున్నడు. ఉద్యమకారులకు గుర్తింపేలేదు, అమరవీరులకు విలువలేదు. రాష్ట్రం కోసం పోరాడిన వారిని కూడా మోసం చేసిండు.
ఓసీ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు-వైఫల్యాలు :
- ఆర్య వైశ్య కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్ లను ఏర్పాటు చేస్తానని అనేకసార్లు చెప్పిండు. ఏర్పాటు చేయలేదు.
- కేంద్ర ప్రభుత్వం EWS పథకం పెడితే, రాష్ట్రంలో దానిని రెండు సంవత్సరాల పాటు అమలు కానియ్యకుండా చేసి అన్యాయం చేసిండు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అవాంతరాలు కల్పిస్తున్నాడు.
జర్నలిస్టులకు :
- జర్నలిస్టులకు ఇంటిస్థలాలు ఇస్తాం, మోడల్ కాలనీ కట్టిస్తాం అన్నడు.. జర్నలిస్ట్ లను కూడా దగా చేసిండు.
- జవహర్ లాల్ నెహ్రూ మ్యూచువల్లీ ఎయిడెడ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ పేట్ బషీరాబాద్ లో 32 ఎకరాల భూముల గురించి 14 సంవత్సరాల నుంచి న్యాయపోరాటం చేసి, సుప్రీంకోర్టులో గెలిచింది. (అవి జర్నలిస్టులు ప్రభుత్వం దగ్గర కొనుక్కున్న భూములు). కాని కేసీఆర్ ఆ భూములను జర్నలిస్టులకు ఇవ్వడంలేదు. కోర్టు ఆదేశాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కచేయడంలేదు.
ఇతరత్రా :
129) 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందిస్తామన్నడు. ఇయ్యలేదు. అర్హులైన వారు ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నరు.
130) సొంత జాగా ఉంటే, ఇళ్లు నిర్మించుకోలేని పేదలకు నియోజకవర్గానికి 1500 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదు.
131) గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నడు. పరిష్కరించలేదు.
132) ఏడాదిన్నరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 13 లిఫ్టులను రూ.2,500 కోట్లతో పూర్తి చేస్తామని చెప్పిండు.. ఎలాంటి పనులు చేపట్టలే.
133) రాష్ట్రంలో 2 లక్షల 91 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిండు. దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 4 కోట్లకు పైగా ఇండ్లను కట్టించింది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కనీసం 30 వేల ఇండ్లు కూడా పంపిణీ చేయలేదు. ప్రతి నియోజకవర్గంలో ఇండ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. (అవి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకే కేటాయిస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నరు).
134) వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి చట్టపరంగా భూమిని బదిలీ చేయకుండా ఏడేండ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసిండు.
135) కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు న్యాయమైన వాటా 575 టీఎంసీలు రావాల్సి ఉండగా, బీఆర్ఎస్ సర్కార్ కేవలం 299 టీఎంసీలకే అంగీకరించి తెలంగాణ రైతులకు అన్యాయం చేసింది.
లిక్కర్, డ్రగ్స్ వినియోగం:
136) బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలే ప్రధాన ఆదాయ వనరుగా పరిపాలన సాగిస్తోంది. ప్రజలను మద్యానికి బానిసలు కావడానికి ప్రోత్సహిస్తోంది. గల్లీకొక బెల్టు షాపు ఉంది. ఎక్సైజ్ శాఖ అధికారులే బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. విచ్చలవిడి మద్యం కారణంగా యువత తాగుడుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
137) రాష్ట్రంలో డీఅడిక్షన్ సెంటర్లు పెడతానని హామీ ఇచ్చాడు. కాని ఏర్పాటు చేయలేదు.
138) రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. మాదకద్రవ్యాల వినియోగం స్వైరవిహారం చేస్తున్నా అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.
139) డ్రగ్స్ కేసులో వీఐపీ అనుమానితులను పోలీసులు పట్టుకున్నా.. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వారిని కనీసం కోర్టుకు కూడా పంపకుండా నిరపరాధులంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇది డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడమే. ప్రభుత్వ అసమర్థతతో ప్రతీ గ్రామంలో గంజాయి వినియోగం పెరుగుతోంది. తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి, డ్రగ్స్ రవాణా జరుగుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారింది.
నేరాలు:
140) మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగాయి. మత్తు పదార్థాల వాడకం పెరగడం వల్లే నేరాల సంఖ్య పెరిగుతోంది.
141) ప్రభుత్వ అండతోనే రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా విపరీతంగా పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని అడ్డుకున్నందుకు అదే వాహనంతో ఢీకొట్టి దళితుడు ఎరుకల భూమయ్యను హత్య చేశారు. చీర్లవంచ, కోదురుపాక ప్రాంతాల్లో ఇసుక లారీలు ఢీకొని మరో ముగ్గురు మృతి చెందారు.
142) రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో దేశ భద్రతకు ముప్పు తెచ్చే ఇస్లామిక్ కారిడార్ పెరుగుతున్నా స్వార్థ రాజకీయ కారణాల బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
143) ఉగ్రవాద హమాస్‌కు అనుకూలంగా హైదరాబాద్‌లో ర్యాలీలు జరిగినా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. రాష్ట్రంలో రాడికలైజేషన్ ఆఫ్ ఇస్లాం, ఉగ్రవాద హమాస్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. పర్యవసానంగా హైదరాబాద్ ఉగ్రచర్యలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ సంతుష్టీకరణ విధానం వల్ల.. రోహింగ్యాల సంఖ్య లక్షల్లో పెరిగింది. పైగా రోహింగ్యాలకు ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. దీనివల్ల ఇస్లామిక్ టెర్రరిజం పెరిగి దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతోంది. తెలంగాణలోని ఇస్లామిక్ టెర్రరిస్టులను మధ్యప్రదేశ్ పోలీసులు వచ్చి పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ఇస్లామిక్ టెర్రరిస్టులు, ఐఎస్ఐఎస్ స్లీపర్ సెల్స్, పీఎఫ్ఐ మొదలగు ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపులు రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరిస్తున్నా రాష్ట్ర ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలు ఇస్లామిక్ టెర్రరిజాన్ని కనిపెట్టడంలో విఫలమవుతున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణం. ఇట్లాంటి వైఖరి వల్ల దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతోంది.
144) బైంసాలో హిందువులపై దాడులు జరిగినా, ఉల్టా హిందువులే పీడీయాక్టు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
పరిపాలనా లోపాలు:
145) కేసీఆర్ గత పడేండ్లలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో లేని ముఖ్యమంత్రిగా దేశంలోనే నెంబర్ 1. స్థానంలో నిలిచిండు.
కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి దొరకదు.
146) రాష్ట్ర పాలన మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావుల ఆదేశాల ప్రకారమే నడుస్తోంది. కేసీఆర్ కుటుంబం చేతిలో యావత్ తెలంగాణ బందీ అయింది.
147) ఫాంహౌస్, ప్రగతిభవన్ లు రియల్టర్లు, కబ్జాదారులు, మాఫియా గ్యాంగులకు అడ్డాగా మారాయి.
148) ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం అనేది పూర్తిగా కుంటుపడింది. వీటి ఆర్థిక కేటాయింపులు ఇతర రంగాలకు మళ్లించి, వారిని దగా చేశారు.
149) గ్రామీణ, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి లేదు. రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.
150) కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత సహకరించినా.. కేసీఆర్ కేంద్రంతో ఘర్షణ వైఖరే అవలంభిస్తున్నాడు. కేంద్రం మీద అసత్య ఆరోపణలు చేస్తూ తెలంగాణకు కేంద్రం వ్యతిరేకమనే భావన ప్రజల్లో కల్పిస్తున్నాడు.
151) తెలంగాణ పోలీసులు, పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులని చెప్పినా కేవలం అధికారపార్టీకి ఫ్రెండ్లీ పోలీసులుగా వ్యవహరిస్తూ, బీఆర్ఎస్ కు వంతపాడుతూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు విని అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు.
152) రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్‌కు ఏడాదిన్నరగా చైర్మన్, సభ్యుల నియామకం జరగలేదు. హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రజలు ఫిర్యాదు చేయడానికి కమిషన్ లేదు.
153) కలెక్టర్ల ఒత్తిడి మేరకు గ్రామ అభివృద్ధికి సర్పంచులు తమ సొంత డబ్బులు ఖర్చు పెడితే, వాటి బిల్లులును బీఆర్ఎస్ సర్కారు ఏండ్ల తరబడి చెల్లించకపోవడం వల్ల బీఆర్ఎస్ సర్పంచులు కూడా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు
154) ఉద్యమద్రోహులకు మంత్రులు, ఇతర కీలకపదవులిచ్చి ఉద్యమకారులను రోడ్డునపడేశారు.

