Andhra PradeshHome Page Slider

కుటుంబ పార్టీలకు దూరం..జనసేనతోనే కలిసి నడుస్తాం: సోము వీర్రాజు

ఏపీలో జనసేనతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులపై ఊహాగానాలు వస్తుండటంతో కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీ దూరమని ఆయన ఉద్ఘాటించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన పార్టీ కార్యకర్తలు సమావేశంలో సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి రాజధాని కాబట్టే కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు విడుదలైనట్లు తెలిపారు. రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీకి మరో ఆలోచన లేదని అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాజధాని విషయంలో నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నట్లు సోము ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టితో మూడు లక్షల కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని దొంగ ఓట్లు చేర్చడంతో వైఎస్సార్సీపీ నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు.