Home Page SliderNational

లోక్ సభ ఎన్నికల వేళ ఏపీకి కొత్త ఇన్‌చార్జ్ నియమించిన బీజేపీ

లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులు కుదిరినప్పటికీ సీట్ల సర్దుబాటు విషయంలో పీటముడి పడినట్టు తెలుస్తోంది. ఏపీలో సీట్ల వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావడం కోసం తాజాగా పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు అరుణ్ సింగ్ ను పార్టీ నియమించినట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి మూడు పార్టీల మధ్య ఉన్న గందరగోళం నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల ఇంచార్జ్‌లు, కో ఇన్ చార్జిలను తాజాగా పార్టీ నియమించింది. అరుణ్ సింగ్‌కు సహాయంగా కో ఇన్ చార్జిగా యూపీ మాజీ మంత్రి సిద్ధార్ధ్ నాథ్ సింగ్‌ను నియమించింది.

ఇక రాజస్థాన్ ఎన్నికల ఇంచార్జిగా సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధే నియమితులయ్యారు. అదే సమయంలో, విజయ రహత్కర్, ప్రవేశ్ వర్మలను కో ఇన్ చార్జిలుగా పార్టీ నియమించింది. హర్యానాలో, రాజస్థాన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియాను ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా, ఎంపీ సురేంద్ర సింగ్ నగర్‌ కో-ఇన్‌చార్జ్‌గా పార్టీ ఎంపిక చేసింది. రాజస్థాన్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్‌ను ఏపీకి నియమించి, ఆ స్థానంలో వినయ్ సహస్రబుద్ధేను నియమించింది.