17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించిన బీజేపీ
లోక్ సభ ఎన్నికలకు బిజెపి రంగం సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఎన్నికలలో మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగినట్లుగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలను మరోసారి బరిలో దించబోతున్నట్టు ప్రకటించిన బీజేపీ పెద్దలు.. గెలుపుపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలైన ఎమ్మెల్యేలను పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ చార్జులుగా నియమించింది. ఎన్నికల్లో విజయం కోసం ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను, త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లోనూ అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టే అభ్యర్థుల విజయానికి నేతలు కృషి చేయాలని పార్టీ పేర్కొంది. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నియోజకవర్గాలకు నేతలను నియమించారు.

ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పాయల్ శంకర్‌కు ఆదిలాబాద్ ఎంపీ బాధ్యతలను కట్టబెట్టారు. పెద్దపల్లికి, ముథోల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన, రామారావు పటేల్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. కరీంనగర్ నియోజకవర్గానికి… నిజామాబాద్ అర్బన్ నుంచి విజయం సాధించిన ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తను, నిర్మల్ నుంచి విజయం సాధించిన ఆలేటి మహేశ్వర్ రెడ్డిని నిజామాబాద్ నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు కట్టబెట్టారు. కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్, ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డిని ఓడించిన కాటేపల్లి వెంకట రమణారెడ్డికి జహీరాబాద్ బాధ్యతలు అప్పగించారు. ఇక మెదక్ ఇన్చార్జి బాధ్యతలను సిర్పూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన పాల్వాయి హరీష్ బాబుకు అప్పగించారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గం బాధ్యతలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి కట్టబెట్టారు. ఎమ్మెల్యేలందరూ వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు.

మిగతా తొమ్మిది నియోజవర్గాలకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా… బిజెపి పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు, బిజెపి కీలక నాయకులు డాక్టర్
కె లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. ఇక హైదరాబాద్ లోక్‌సభ ఇన్చార్జి బాధ్యతలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అప్పగించారు. చేవెళ్ల బాధ్యతలను ఎమ్మెల్సీ వెంకట్ నారాయణ రెడ్డికి అప్పగించగా… మహబూబ్నగర్ ఇన్చార్జి బాధ్యతలు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుకు కట్టబెట్టారు. ఇక నాగర్ కర్నూల్ బాధ్యతలు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి ఇచ్చారు. నల్గొండ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి, భువనగిరి బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు అప్పగించారు. వరంగల్ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డికి, మహబూబాబాద్ నియోజకవర్గ బాధ్యతలను గరికపాటి మోహనరావుకు, ఖమ్మం ఇన్‌చార్జ్ బాధ్యతలు పార్టీ ముఖ్యనేత పొంగులేటి సుధాకర్ రెడ్డికి అప్పగించారు.

మొత్తంగా లోక్ సభ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెంచిన బీజేపీ.. ఇప్పుడు ఇన్ చార్జ్‌ల నియామకం ద్వారా మొదటి అడుగు వేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేసేందుకు ప్రయత్నిస్తోందన్నది, ఎవరికి అవకాశం ఇవ్వాలన్నదానిపై నేతలు, పూర్తి రిపోర్ట్ ను బీజేపీ నాయకత్వానికి అప్పగించనున్నారు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాషాయం పార్టీ ఇప్పటికే, పలు నియోజకవర్గాల్లో ఉధృతంగా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. మోదీ పాపులార్టీ కలిసి వస్తోందని, అయోధ్య రామమందిర నినాదం కూడా బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓట్లను రాబడుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. త్వరలోనే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసిన ఎన్నికల శంఖరావాన్ని పూరించేందుకు బీజేపీ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది.

