రాజస్థాన్ సీఎంని ప్రకటించిన బీజేపీ
ఇటీవల కాలంలో దేశంలో ఉన్న 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఛత్తీస్‌ఘడ్ మొత్తం 3 రాష్ట్రాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి బీజేపీ ఈ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులను ప్రకటించడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంది. అయినప్పటికీ గడిచిన రెండు రోజుల నుంచి ఛత్తీస్‌ఘడ్,మధ్యప్రదేశ్ సీఎంలను బీజేపీ ప్రకటిస్తూ వచ్చింది. అయితే ఈ రోజు అందరు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రాజస్థాన్ సీఎం అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. బీజేపీ పార్టీ నిన్న మధ్యప్రదేశ్ సీఎంగా అసలు సీఎం రేసులోనే లేని మోహన్ యాదవ్‌ని ప్రకటించి సంచలనం సృష్టించింది. తాజాగా రాజస్థాన్ సీఎం విషయంలో కూడా బీజేపీ పార్టీ ఎవరు ఊహించని విధంగా సీఎంగా భజన్‌లాల్ శర్మను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవాళ జైపూర్‌లో జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా సంగనేర్ నుంచి తొలిసారిగా గెలిచిన బ్రహ్మణ వర్గానికి చెందిన భజన్‌లాల్ శర్మకి సీఎం పదవిని కేటాయించింది. అయితే ప్రస్తుతం ఈయన బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.


 
							 
							