NationalNews

వినూత్న రీతిలో పుట్టిన రోజు వేడుకలు

ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి రూపంగా భావించిన ఓ తండ్రి.. తన కూతురు పుట్టిన రోజును  వినూత్న రీతిలో నిర్వహించాడు. ఉచితంగా లక్ష పానీపూరీలను స్థానికులకు అందించాడు. అంతేకాక ఆడ పిల్లలకు చదువు చెప్పించడం ఎంత ముఖ్యమో వివరించాడు. కూతుళ్ళతోనే భవిష్యత్తు సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ…  కూతురు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. కోలార్‌ ప్రాంతానికి చెందిన అంచల్‌ గుప్తా దంపతులకు ఆడ పిల్లలంటే ఎంతో ఇష్టం. ఆడ పిల్లలు ఉండే ఇళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని అన్నారు. తన కుమార్తె అనోఖికి మొదటి పుట్టిన రోజు సందర్భంగా `బేటీ బచావ్‌, బేటీ పఢావో’ అనే సందేశంతో బంజారీ మైదానంలో 31 స్టాల్స్‌ను ఏర్పాటు చేసి.. 1.01 లక్షల పానీ పూరీలను ఉచితంగా అందించారు. ఆడపిల్లలను చదివించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుప్తా అన్నారు. గుప్తా చేసిన వేడుకల గురించి తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందించారు. అంతేకాక స్థానిక ఎమ్మెల్యే రామేశ్వర్‌ శర్మ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ప్రశంసించారు.