హమ్మయ్య… బిపోర్‌జాయ్ తీరాన్ని తాకింది
తీవ్ర గాలులతో, కుంభవృష్టితో గుజరాత్ ప్రజలను హడలెత్తించిన బిపోర్‌జాయ్ తుపాన్ ఎట్టకేలకు గురువారం రాత్రికి తీరాన్ని చేరింది. ఈ తుపాన్ అరేబియా సముద్రంలో ఎక్కువ కాలం తిరిగిన తుపాన్‌గా పేరు పొందింది. ఇది కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకింది. ఇది అర్థరాత్రి సమయానికి పూర్తిగా తీరాన్ని తాకింది. ఈ సమయంలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు సమాచారం. ఇప్పటికే తీరప్రాంతాలలో 20 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. అయితే మరో రెండు రోజులు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది తీవ్రతుపాన్‌గా రూపు దిద్దుకుంటోంది. అనంతరం బలహీన పడుతుంది.

ద్వారక, జామ్‌నగర్, పోర్‌బందర్, మోర్బీ తీరాలలో సముద్రపు అలలు 3 నుండి 6 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. అనేక జిల్లాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ తుపాన్ ప్రభావం వల్ల సౌరాష్ట్ర, కచ్, ద్వారక, రాజ్ కోట్, జునాగఢ్ జిల్లాలలో భారీ, అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం18 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అవసరాన్ని బట్టి ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ దళాలను కూడా సిద్దంగా ఉంచింది కేంద్రప్రభుత్వం.

