Home Page SliderNational

బిహార్ రాజకీయ సంక్షోభం, నితీష్ కుమార్ ఏం చేయబోతున్నారు?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2022లో బీజేపీ నుంచి వేరుపడి ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఇప్పుడు మరోసారి ఆ కూటమిని వదిలి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నితీష్ కుమార్ చెప్పేదేదీ చేయడు. చేసేది చెప్పడన్న నానుడి మరోసారి రుజవవుతోంది. నితీష్ కుమార్ 2013 నుండి BJP, కాంగ్రెస్, లాలూ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ మధ్య అటూ ఇటూ జంప్ చేస్తూ వస్తున్నారు. ‘పల్తు రామ్’ అన్న బిరుదు ఏ ఎండకు ఆ గొడుకు నచ్చినట్టుగా వ్యవహరిస్తాడన్న పేరును సంపాదించుకున్నాడు.

2022లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత, 2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని, అధికార పార్టీని ఉమ్మడిగా ఎదుర్కోవడానికి అన్ని ప్రతిపక్ష శక్తులను ఏకం చేసేందుకు ఆయన చొరవ తీసుకున్నారు. ఐతే బీజేపీ ఆడిన అద్భుమైన గేమ్ దెబ్బతో నితీష్ ఆలోచనలు మార్చేసుకున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేసిన తర్వాత ఆయన ఆలోచనలు మారాయి. ఠాకూర్ ఒక దిగ్గజ సోషలిస్ట్ నాయకుడు, 1970లలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. రాష్ట్రంలో వివాదాస్పద మద్యపాన నిషేధ విధానాన్ని అమలు చేసిన ఘనత పొందాడు. నేటికీ ‘జన్ నాయక్’ ‘ప్రజల నాయకుడు’గా గుర్తుంచుకునే కర్పూరీ ఠాకూర్ వారసత్వం… బిహార్‌లోని అన్ని రాజకీయ పార్టీలకు విలువైన ఆస్తిగా మారింది.

నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్ RJD మధ్య విభేదాల నడుమ, ఉపముఖ్యమంత్రి తేజస్వీ లేకుండానే రిపబ్లిక్ డే రోజు నితీష్ కుమార్ బీహార్ గవర్నర్ ను కలిశారు. రాజకీయాల్లో తలుపులు ఎప్పుడూ మూయలేరు.. కావాలంటే తెరుచుకుంటాయంటూ నితీశ్‌ కుమార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల పొత్తును ధ్రువీకరిస్తున్నాయి. జనవరి 13న జరిగిన ఇండియా కూటమి సమావేశం తర్వాత ఆలోచనలు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ సమావేశంలో ఇండియా కూటమికి కన్వీనర్‌గా నితీష్‌ కుమార్‌ పేరును సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రతిపాదించగా, లాలూ యాదవ్‌, శరద్‌ పవార్‌ సహా దాదాపు అందరు నేతలు ఆమోదించారు. అయితే, రాహుల్ గాంధీ జోక్యం చేసుకుంటూ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… నితీష్ కుమార్‌‌కు కీలక బాధ్యతలపై రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పడంతో మొత్తం వ్యవహారం మలుపు తీసుకొంది. కాంగ్రెస్ తీరును జేడీయూ నేతలు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ వార్తలు బీహార్ అంతటా దావనంలా వ్యాపించాయి.

అదే సమయంలో బిహార్ ప్రభుత్వం 79 మంది ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), 45 మంది బీహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (బీఏఎస్) అధికారులను శుక్రవారం బదిలీ చేసింది. నితీష్ కుమార్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న సూచనతో వచ్చే లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు బీజేపీ సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర యూనిట్ చీఫ్ సామ్రాట్ చౌదరి ఊహాగానాలపై నేరుగా స్పందించలేదు. ఐతే తెరవెనుక చర్చలు మాత్రం జరుగుతున్నట్టు తెలుస్తోంది. నితీష్ కుమార్ యూటర్న్ నేపథ్యంలో అటు ఆర్జేడీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలతో భేటీకి పిలిచాయి. అయితే తాజా రాజకీయానికి దానికి సంబంధం లేదని… రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు సంబంధించిన సన్నాహాలను చర్చించించేందుకు తాము సమావేశమయ్యామని పార్టీ చెబుతోంది. నితీష్ కుమార్ ఆదివారం ఉదయం 10 గంటలకు శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ మద్దతుతో తొమ్మిదోసారి ముఖ్యమంత్రి పదవి ఆయన చేపట్టే అవకాశం ఉంది.