గ్రీన్ కార్డు విషయంలో శుభవార్త చెప్పిన బైడెన్
అమెరికా ప్రభుత్వం కొత్త కొత్త నిర్ణయాలతో వలసదారులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తోంది. జోబైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొన్ని నిర్ణయాలను సడలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్పాదాయ వర్గాలపై ట్రంప్ ప్రభుత్వ కఠిన నిర్ణయాలను రద్దు చేస్తున్నారు. ఆదాయం, ప్రభుత్వ సబ్సిడీలతో సంబంధం లేకుండా ఎవరైనా గ్రీన్ కార్డులు పొందేందుకు అర్హులని బైడెన్ ప్రభుత్వం తెలియజేసింది. ఈ నిబంధనలు డిసెంబరు 23 నుండి అమల్లోకి రానున్నాయి.
గత ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డ్ జారీకి సంబంధించి ఫుడ్ స్టాంపులు, హౌసింగ్ వోచర్లు, మెడికల్ సాయం పొందిన వారికి గ్రీన్ కార్డులను నిరాకరించింది. అంతేకాదు, వలసదారుల ఆదాయం, వయస్సు, ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకునేది. ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం గ్రీన్ కార్డుల జారీకి వీటిని పరిగణనలోనికి తీసుకోకూడదని నిర్ణయించింది. దీనితో అమెరికాలో ఉంటున్న ఇతరదేశాల నుంచి వచ్చిన వారికి పెద్ద ఊరట లభించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా భారతదేశానికి చెందిన వారికి ఇది శుభవార్త.

