అణుదాడి తర్వాత ఇక ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉండబోడన్న బైడెన్
ఉత్తర కొరియా అణు దాడికి పాల్పడితే తాము ఆ పాలనకు ముగింపు పలుకుతామని, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ను హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అణుదాడులు జరిపే ఆలోచన ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, అమెరికా పర్యటన సందర్భంగా బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా అణు ఆయుధాలను ఉపయోగిస్తే, దేశాధ్యక్షుడు “ముగింపు”ను చూడాల్సి వస్తోందన్నారు బైడెన్. వైట్ హౌస్‌లో ఇద్దరు నాయకులు మాట్లాడుతూ, అణ్వాయుధ ఉత్తర దూకుడు క్షిపణి పరీక్షల నేపథ్యంలో దక్షిణ కొరియాకు అమెరికా భద్రతా కవచాన్ని పటిష్టవంతం చేస్తుందన్నారు.

ఉత్తర కొరియాలోని నియంతృత్వ పాలకుడు దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్‌పై దాడి చేస్తే, ప్రతిస్పందన వినాశకరమైనదని ఇద్దరు నేతలు తేల్చి చెప్పారు. ఉత్తర కొరియా జరుపుతున్న బాలిస్టిక్ క్షిపణి పరీక్షలపై ఎలా స్పందించాలనే దానిపై సమావేశంలో చర్చించారు. సమావేశానంతరం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన జో బైడెన్ అమెరికా, దాని మిత్రదేశాలపై ఉత్తర కొరియా అణుదాడి చేస్తే ఏ విధంగానూ అంగీకరించబోమని స్పష్టం చేశారు.

ఉత్తర కొరియా నుంచి అందుతోన్న సమాచారం మరియు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన సమాచారం ఆధారంగా ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో దాని గురించి కొంత సమాచారం లీక్ అవుతోంది. పొరుగు దేశం దక్షిణ కొరియా, జపాన్‌లకే కాదు ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకు కూడా ఉత్తర కొరియా సవాల్ విసురుతోంది. ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న కిమ్ జంగ్ ఉన్ కూడా తన వికృత చేష్టలతో అమెరికాను ముప్పుతిప్పలు పెడుతున్నారు.

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు, అణ్వాయుధ పరీక్షలు, సముద్రంలో కృత్రిమ సునామీ పరీక్షలు, ప్రపంచాన్ని వణికిస్తున్న కిమ్ జంగ్ ఉన్.. అమెరికా సహా దేశాల హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. కనీసం వారానికి ఒకసారి క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అమెరికా అంచనా వేస్తోంది. ఉత్తర కొరియాపై బలమైన ఆర్థిక ఆంక్షలు విధించారు. దీనివల్ల దేశంలో పేదరికం పెరిగిపోతోంది. అయితే, ఇంత పేదరికం ఉన్నప్పటికీ, ఉత్తర కొరియా తన సాయుధ బలగాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతోంది. ఉత్తర కొరియాను ప్రపంచంలోని రహస్య దేశంగా పిలుస్తారు. ఆ దేశంలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదు.