బీభత్సంగా బియాస్ నది-దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలు విలవిల
ఉత్తర భారత రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. రాజధాని దిల్లీ సహా పంజాబ్, హర్యాణా,జమ్ము-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లు వరదబీభత్సంతో అస్తవ్యస్తమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ప్రజల జనజీవనం స్తంభించింది. నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాదిన నదులన్నీ పొంగిపోవడంతో దిల్లీకి కూడా వరద పోటు మొదలయ్యింది. ఎన్నడూ లేనిది యమునానది కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద నీటిమట్టం పూర్తి స్థాయిలో ఉంది. ఏ క్షణాన్నైనా ప్రమాద స్థాయిని మించిపోవచ్చు. దీనితో దిల్లీకి వరదలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అధికారులు అప్రమత్తమై 16 వరద కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. దిల్లీ, నోయిడాలలో, గురుగ్రామ్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దిల్లీలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు మునిగి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. కులు, మనాలి ప్రాంతంలో అనేక చోట్ల ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ నదిపై పలుచోట్ల వంతెనలు కూలిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసలే అతి వేగంగా ప్రవహించే బియాస్ నదికి వరద నీరు చేరడంతో దాని వేగానికి అదుపు లేకుండా పోయింది. అనేక చోట్ల వాహనాలు కూడా నదిలో కొట్టుకొని పోతున్నాయి. అక్కడ దాదాపు 10 జిల్లాలకు రెడ్ ఎలర్ట్ ప్రకటించారు. భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. దీనీతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానిక సంస్థలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరదలలో చిక్కుకున్నవారిని కాపాడి వారికి పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలిక రక్షణా శిబిరాలు ఏర్పాటు చేశారు.