భోగాపురం మాది.. భజన మీదా?
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘క్రెడిట్ చోరీ’ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తులైతే, తనలోని నటనా కౌశలాన్ని ప్రదర్శించడంలో పవన్ కళ్యాణ్ దిట్ట అని అంబటి ఎద్దేవా చేశారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అంబటి మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ కేటాయింపులు, అవసరమైన అనుమతులు, పునరావాస పనులు వంటి కీలక ప్రక్రియలన్నీ గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. “చంద్రబాబు గతంలో పదివేల ఎకరాలు కావాలని కోరితే ప్రజలు తిరగబడ్డారు.. కానీ జగన్ గారు దానిని హేతుబద్ధంగా కుదించి ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఇప్పుడు ఆ క్రెడిట్ తమదే అని చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది” అని విమర్శించారు.
రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తోందని చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ ఒట్టి బడాయి అని అంబటి కొట్టిపారేశారు. వైఎస్సార్సీపీ హయాంలోనే రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా గత ప్రభుత్వ కాలంలో 32 లక్షల ఉద్యోగాలు వస్తే, గత చంద్రబాబు హయాంలో కేవలం 9 లక్షల ఉద్యోగాలే వచ్చాయని గణాంకాలను వివరించారు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు చంద్రబాబు లోపాయికారీగా సహకరిస్తున్నారని ఆరోపించారు.
ప్రజలపై పన్నుల భారం మోపి వేధిస్తున్న ఘనత చంద్రబాబుదేనని అంబటి దుయ్యబట్టారు. కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పి, అధికారంలోకి వచ్చాక రూ.20 వేల కోట్లకు పైగా భారాన్ని ప్రజలపై వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “వైఎస్ జగన్ అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని నాడు విమర్శించిన చంద్రబాబు.. ఈ 18 నెలల కాలంలోనే రూ.3.7 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏమనాలో చంద్రబాబే సమాధానం చెప్పాలి” అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

