భారత్ అమ్ములపొదిలో చేరనున్న ‘భార్గవాస్త్ర..’
ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్‌ను మట్టికరిపించి, భారీ విజయం సాధించిన భారత ఆర్మీ తన అమ్ములపొదిలో శక్తివంతమైన మరిన్ని అస్త్రాలు చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. తాజాగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించారు. దీనిని సోలార్ ఢిఫెన్స్, ఏరోస్పేస్ లిమిటెడ్ కలిసి సంయుక్తంగా రూపొందించాయి. ప్రత్యర్థి డ్రోన్లను అడ్డుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా పనిచేసే, మైక్రో మిస్సైల్‌గా దీనిని ప్రకటించారు. ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో గల సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించారు. ఇది అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఇది 2.5 కిలోమీటర్ల దూరం నుండి శత్రు డ్రోన్లను గుర్తించి మైక్రో రాకెట్ సాయంతో నిర్వీర్యం చేయగలదు. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూపొందించిన ‘అక్షతీర్’ గగనతల రక్షణ వ్యవస్థ కూడా పాకిస్తాన్ చేపట్టిన దాడులని సమర్థవంతంగా తిప్పికొట్టిందని కంపెనీ ట్వీట్ చేసింది.