ఉప్పల్ మ్యాచ్‌లో శుభమన్ శుభారంభం
న్యూజిలాండ్ – భారత్ తొలి వన్డే సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ ధమాకా సాధించాడు. 208 పరుగులతో ద్విశతకం చేశాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సలతో గ్రౌండ్‌ను ఉర్రూతలూగించాడు. మెరుపు వేగంతో ఆడుతూ పరుగుల సునామీని సృష్టించాడు. దీనితో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 భారీ లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచింది.. రోహిత్, సూర్యకుమార్, హార్దిక్ వరుసగా 34, 31, 28 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లు మిచెల్, షిప్లే చెరొక రెండువికెట్లు తీసుకోగా, ఫెర్గూసన్, టిక్నర్, శాంట్నర్ తలొక వికెట్ తీశారు.
ఇంటర్నేషనల్ కెరీర్‌లో తొలిసారి డబుల్ సెంచరీ సాధించిన గిల్ హ్యాట్రిక్ సిక్సర్లతో 200 మార్క్‌ను చేరుకున్నాడు. డబుల్ సెంచరీ సాధించే క్రమంలో గిల్ పలు రికార్డుల మోత మోగించాడు. అత్యంత పిన్న వయసులో (23 ఏళ్ల 132 రోజులు) డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు. ఇంతకు ముందు ఈ రికార్డు ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉండేది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అత్యధిక స్కోర్ రికార్డు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (2009లో ఆసీస్‌పై 175 పరుగులు) పేరిట ఉండేది. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్. గతంలో ఈ రికార్డు సచిన్ (186 నాటౌట్) పేరిట ఉండేది. వరుస వన్డే ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, డబుల్ సెంచరీతో పాటు హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన ఘనత గిల్‌కే దక్కుతుంది. వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్‌ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు. ఈ రికార్డు పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ (18) పేరిట ఉంది. టీమిండియా తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ (24 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నారు.

