Home Page SliderNational

వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి భారత్ రైస్.. కిలో రూ. 29కే

బియ్యం ధరలపై కేంద్రం యుద్ధం
ధరలను తగ్గించేందుకు మార్కెట్‌లో భారత్ రైస్
కిలో రూ. 29కే అందిస్తామంటున్న కేంద్రం
కేంద్ర సహకార సంస్థల ద్వారా మార్కెట్‌లో బియ్యం
ఈ కామర్స్ ప్లాట్ ఫామ్‌లలోనూ విక్రయిస్తామని ప్రకటన
వ్యాపారస్తులు బియ్యం స్టాక్‌లను చెప్పాల్సిందేనన్న కేంద్రం

దేశ వ్యాప్తంగా బియ్యం ధరల ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఇప్పటికే బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్రం, ఇకపై రిటైలర్లు, అమ్మకందారులు ఇష్టానుసారంగా బియ్యం నిల్వలు ఉంచుకోడానికి లేదని.. ప్రతి శుక్రవారం స్టాక్ లెక్కలు చెప్పాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. అదే సమయంలో బియ్యం ధరలను దిగివచ్చే వరకు తక్కువ ధరకు భారత్ రైస్‌ను అందుబాటులో ఉంచుతామంది. సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు వచ్చే వారం నుంచి రిటైల్ మార్కెట్‌లో ‘భారత్ రైస్’ని కిలో రూ. 29కి విక్రయిస్తామని కేంద్రం పేర్కొంది. బియ్యం ధరలను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా వారి వారి దగ్గర ఉన్న బియ్యం స్టాక్‌ను వెల్లడించాలని వ్యాపారులను ఆదేశించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వివిధ రకాల ఎగుమతులపై పరిమితులు ఉన్నప్పటికీ గత ఏడాది కాలంలో బియ్యం రిటైల్ మరియు టోకు ధరలు దాదాపు 15 శాతం పెరిగాయని కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా చెప్పారు.

ధరలను నియంత్రించేందుకు, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్… రెండు సహకార సంఘాలతోపాటుగా కేంద్రీయ భండార్ ద్వారా రిటైల్ మార్కెట్‌లో సబ్సిడీతో కూడిన ‘భారత్ రైస్’ని 29 రూపాయలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా భారత్ రైస్‌ను విక్రయించేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. భారత్ రైస్ వచ్చే వారం నుంచి మార్కెట్‌లో 5కేజీలు, 10కేజీల ప్యాక్‌లలో అందుబాటులోకి వస్తాయన్నారు. మొదటి దశలో, రిటైల్ మార్కెట్‌లో విక్రయించడానికి ప్రభుత్వం 5 లక్షల టన్నుల బియ్యం అందుబాటులో ఉందని చోప్రా చెప్పారు.

ప్రభుత్వం ఇప్పటికే భారత్ అటా గోధమ పిండి కిలో రూ.27.50కి, భారత్ దాల్ (చానా) కిలో రూ.60కి విక్రయిస్తోందన్నారు. బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చోప్రా అన్నారు. మార్కెట్లో పుకార్లను నమ్మొద్దన్నారు. ధరలు తగ్గే వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. రిటైలర్లు, టోకు వ్యాపారులు, అమ్మకందారులు ప్రతి శుక్రవారం తన పోర్టల్‌లో బియ్యం స్టాక్‌ను వెల్లడించాలని మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుందని చోప్రా చెప్పారు. ప్రభుత్వం బియ్యంపై స్టాక్ పరిమితిని విధిస్తుందా అని అడిగిన ప్రశ్నకు, ధరలను తగ్గించడానికి అన్ని అవకాశాలను పరిశీలిస్తామన్నారు. బియ్యం మినహా అన్ని అవసరమైన ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉన్నాయని ఆయన తెలిపారు.