Home Page SliderNational

పీ.వీ.కి భారతరత్న ప్రదానం.. స్వీకరించిన కుమారుడు ప్రభాకర్‌రావు

ఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానోత్సవం శనివారం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము వీటిని ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జైశంకర్, కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు హాజరయ్యారు. పలురంగాల్లో దేశానికి సేవలందించిన ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాది మూడు విడతల్లో భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ను ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం అద్వానీ ఇంటికివెళ్లి భారతరత్న ప్రదానం చేయనున్నారు.