అక్రమ కేసులు పెడితే ఖబడ్దార్!
కాంగ్రెస్ ప్రభుత్వం తన అవినీతిని పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్, ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.
ప్రస్తుత ప్రభుత్వం ‘టీబ్లూఆర్ ట్యాక్స్’ పేరిట వేల కోట్ల రూపాయలను దోచుకుంటోందని, ఈ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెడితే, రేవంత్ సర్కార్ కేవలం రెండేళ్లలోనే తెలంగాణను సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లజెండాలతో రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నినదించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కంటే రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే కాంగ్రెస్ ప్రాధాన్యతగా మారిందని, ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.

