అన్నపూర్ణాదేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ
“ప్రాలేయాంచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ..భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ” అంటూ భక్తులు ఆ జగన్మాతను కొలుస్తుంటారు. ‘కోటి విద్యలూ కూటి కొరకే’ అంటారు. ప్రతీ జీవీ తన ఆకలి తీర్చుకోవడానికి తాపత్రయపడుతుంటుంది. హిందువులు అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. సకల జీవులకూ ఆహారాన్ని, భిక్షను ప్రసాదించేది ఆదుర్గమ్మతల్లే. దేవీ నవరాత్రులలో మూడవరోజున అన్నపూర్ణాదేవి అలంకారంలో కొలువుతీరింది బెజవాడలోని కనకదుర్గమ్మ.

ఎడమ చేతిలో బంగారు పాత్రలో అన్నాన్ని, వజ్రాలు పొదిగిన గరిటెతో తన పతి అయిన పరమేశ్వరునికి వడ్డిస్తూ ఉండే అవతారాన్ని దర్శించడానికి రెండుకళ్లూ సరిపోవు. అన్నపూర్ణమ్మను పూజిస్తే అన్నపానాదులకు లోటు ఉండదని ప్రతీతి. కాశీ పురంలో విశ్వనాధుని గుడి పక్కనే వెలసిన అన్నపూర్ణ అవతారంలో విజయవాడలోని అమ్మవారికి అలంకారం చేశారు. భక్తులు ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ దర్శనం చేసుకోవడానికి వీలుకల్పిస్తున్నామని దేవస్థానం వర్గాలు తెలియజేశారు. కుంకుమార్చనలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. చండీ హోమంలో కూడా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు.

