ఎన్నికలు రాకముందే ఆ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం !
తెలంగాణలో ఇంకా పంచాయతీ ఎన్నికల నగరా మోగకముందే ఓ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్ (డి) చెరువు కొమ్ము తండాకు చెందిన సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గ్రామంలో 3 ఆలయాలు కట్టించి, బొడ్రాయి పండుగ వేళ ఇంటికి రూ. 1000 ఇస్తానని దరావత్ బాలాజీ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. దీంతో ఆ అభ్యర్థికి ఊరోళ్లంతా జై కొట్టారు. అగ్రిమెంట్ రాసిన అనంతరం విజయోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నారు. చెరువు కొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా, 700 మంది ఓటర్లు ఉన్నారు.
ఇందుకోసం వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకుండా, తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్ పెట్టాడు. దీనికి ఒప్పుకున్న గ్రామస్తులు.. సర్పంచ్ అయ్యాక మాట తప్పితే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఎన్నికలు రాక ముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తానని దరావత్ బాలాజీ మాట ఇచ్చారు. దీంతో గ్రామంలోని పెద్దలు సమావేశాన్ని ఏర్పాటు చేసి అగ్రిమెంట్ పేపర్ రాసుకొని.. సర్పంచ్ అభ్యర్థి, గ్రామస్తులతో సంతకాలు పెట్టించారు. గడువులోగా పనులు పూర్తయితే.. కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని.. దీనిని అతిక్రమించి ఎవరు నామినేషన్ వేసినా బాలాజీకి రూ.50 లక్షలు జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్ లో రాసుకున్నారు. ఒప్పంద పత్రంపై ఇరుపక్షాలవారు సంతకాలు చేయగానే సర్పంచ్ అభ్యర్థితోపాటు గ్రామస్తులంతా వేడుకలు జరుపుకున్నారు.

