రూ.5 లక్షల కోట్లు హాంఫట్.. బేర్‌మన్న షేర్ మార్కెట్
భారతీయ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లు నష్టపోయి 58,098.92 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 302.45 పాయింట్లు కోల్పోయి 17,327.35 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ.80.99కి పతనమైంది. దీంతో బీఎస్‌ఈలో ఏకంగా రూ.4.9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 30 షేర్లలో సన్‌ఫార్మా, టాటా స్టీల్, ఐటీసీ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. దీంతో ఈ రోజును బ్లాక్ ఫ్రైడేగా స్టాక్ మార్కెటర్లు పేర్కొన్నారు.

పతనానికి కారణాలివే..
అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచి 3.25 శాతానికి చేర్చింది. భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నది. ఆర్థిక మాంద్యం ప్రమాదమూ పొంచి ఉందని తెలిపింది. బ్రిటన్, స్విట్జర్లాండ్ కూడా రేట్లను పెంచాయి. ఆర్‌బీఐ కూడా వడ్డీ రేట్లను పెంచనుందని వార్తలొస్తున్నాయి. గతంలో అంచనా వేసినట్లు 35 బేసిస్ పాయింట్లు కాకుండా 50 బేసిస్ పాయింట్లు పెంచుతుందని తెలుస్తోంది. రూపాయి పతనం వల్ల కూడా ఆర్‌బీఐపై ఒత్తిడి పెరిగింది. అందుకే స్టాక్ మార్కెట్ పతనమైందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

