స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరిణామ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, జిల్లాల ఇంచార్జ్ మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశంలో పాల్గొన్న ఆయన, స్థానిక ఎన్నికలపై అందరూ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించారు.
ఇంచార్జ్ మంత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని, హైదరాబాద్‌లో ఉండకూడదని సీఎం రేవంత్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని, స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు చూపాలని ఆయన సూచించారు. నామినేషన్ల విషయంలో సందేహాలు ఉన్నవారు లీగల్ సెల్‌ను సంప్రదించాలని సూచించిన సీఎం, కోర్టు విచారణలపై సున్నితంగా దృష్టి పెట్టాలని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభించేలా సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశించారు.
అభ్యర్థుల ఎంపికలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు ఎవరూ రాజకీయ ప్రకటనలు చేయొద్దని సూచించారు. మొదటి విడత ఎన్నికల కోసం నేటి రాత్రికే అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని ఇంచార్జ్ మంత్రులు, పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.
పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ మొదలైనందున పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ పరంగా ఈ ఎన్నికలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచిస్తూ, ప్రతి స్థాయిలో సమన్వయం చేసుకుని క్లీన్ స్వీప్ సాధించాలన్నారు.
దక్షిణ తెలంగాణాలో క్లీన్ స్వీప్ చేస్తాం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అయితే, విపక్షం బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో పార్టీ దృష్టి మరింతగా సారించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.