మోసపూరిత వాట్సాప్ ఖాతాలపై అప్రమత్తంగా ఉండండి
సైబర్ నేరాల పట్ల మరోసారి ప్రజలను అప్రమత్తం చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. “ముఖం చూసి మోసపోవద్దు… జాగ్రత్త” అంటూ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
తన ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టి, తన పేరుతో కొందరు వ్యక్తులు తెలిసిన వారికి సందేశాలు పంపిస్తున్నారని సజ్జనార్ తెలిపారు. “ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి. ఇలాంటి సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకండి. వెంటనే ఆ నంబర్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి” అని ఆయన సూచించారు.
సైబర్ నేరగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలను ఇవ్వవద్దని, డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించవద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. “సైబర్ మోసగాళ్లకు మీ జాగ్రత్తే అడ్డుకట్ట” అని స్పష్టం చేశారు.
నకిలీ వాట్సాప్ ఖాతాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని, లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

