Home Page SliderTelangana

బీజేపీ బీసీ సీఎం అస్త్రం, రేసులో లక్ష్మణ్, ఈటల, బండి, అర్వింద్

బీసీ జపం చేస్తున్న బీజేపీ హైకమాండ్
బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థే సీఎం అన్న భావన
రేపోమాపో సీఎం అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్
రేసులో నలుగురు బీజేపీ ముఖ్యనేతలు
అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీకి కౌంటర్
తెలంగాణ బడుగుల కోసమేనన్న సంకేతాలు
ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసిన హైకమాండ్
ఎన్నికల్లో బహుజనుల మద్దతు పొందేలా ఎత్తుగడ

తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భావిస్తున్న బీజేపీ అందుకు తగిన కసరత్తు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ అందుకు తగిన కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పలు సామాజికవర్గాలు సీఎంగా బాధ్యతలు చేపట్టగా బీసీలకు మాత్రం ఇప్పటి వరకు ఆ అవకాశం లభించలేదు. సకలజనులందరూ పోరాడటం వల్లే తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ ఉద్యమంలో సమిధలయ్యింది కూడా బడుగు బలహీనవర్గాలే. ఆయా వర్గాలన్నీ కూడా రాజకీయంగా అవకాశాలు వస్తాయని గత పదేళ్లుగా ఎదురు చూస్తూ వచ్చాయి. కానీ ఆ పార్టీ, ఈ పార్టీ అన్న మాట లేకుండా ఎవరూ కూడా బీసీలకు లిఫ్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించలేదు. దీంతో ఈసారి బడుగు, బలహీనవర్గాల ఓటర్లు తాము అధికారాన్ని అందుకోవాలని కసిగా ఉన్నాయి. తెలంగాణలో బీసీ ఓటర్లు సుమారుగా 52 నుంచి 54 శాతం వరకు ఉన్నారు. ఆయా వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత లభించినప్పుడు మాత్రమే ఆయా కులాలకు భవిత అని భావన ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీసీలు కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.

ఇప్పటికే బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందంటూ ఆ పార్టీలోని పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సైతం బీసీలకు గౌరవం ఇవ్వడం లేదన్న ఫీలింగ్ ఉంది. బయటకు బీసీల జపం చేస్తున్నప్పటికీ రెండు పార్టీలు బీసీలను వంచిస్తున్నాయన్న ఆయా వర్గాలు ఆవేదనతో ఉన్నాయ్. ఇటీవల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభ.. రాష్ట్రంలో ఉన్న 70 లక్షల జనాభాలో ఒక్కరంటే ఒక్క ముదిరాజ్ నాయకుడు లేడా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బీసీల ఆక్రోశం, ఆగ్రహంతో వారు ఎలా రియాక్ట్ అవుతారోనన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో బీసీలకు అండగా మేముంటామంటూ బీజేపీ ముందుకు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీసీలకు కీలక పదవులు కట్టబెట్టడమే కాదు.. బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామంటూ బీజేపీ హైకమాండ్ చర్చలు జరుపుతోంది. తెలంగాణలో బీసీ తంత్రం.. ఓట్లు రాలుస్తుందని బీజేపీ భావిస్తోంది. బీజేపీలు ఉన్న బడుగు నేతలు ఇప్పుడు సీఎం రేసులో దూసుకొస్తున్నారు.

బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కీలక స్థానాలను గెలుచుకుంటే బీసీ సీఎం అవుతారని.. ఆ అవకాశం లక్ష్మణ్ కు లభిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. లక్ష్మణ్ గతంలో జాతీయ ఓబీసీ పార్టీ సెల్ అధ్యక్షులుగానూ వ్యవహరించారు. ఆ తర్వాత బీజేపీ ఆయనను పార్టీలో అత్యున్నత స్థాయి హోదాను ఇచ్చి గౌరవిస్తోంది. అదే సమయంలో బీజేపీలో చేరి పార్టీకి దన్నుగా నిలుస్తున్న ఈటల రాజేందర్ వైపు, పార్టీ చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. పార్టీకి ఊపు తీసుకొస్తారని నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈటలకు క్రేజ్ ఉంది. కేసీఆర్ ను ఢీకొట్టిన నేతగా తెలంగాణ బహుజనులు ఆయనకు నీరాజనం పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈటల గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని చెప్పడం ద్వారా.. కేసీఆర్‌కు అసలైన ప్రత్యర్థి ఈటలేనన్న భావన ఉంది. పార్టీ హైకమాండ్ సైతం ఈటల విషయంలో ముందడగేసే ఆలోచనలో ఉంది.

అదే సమయంలో బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం సీఎం రేసులో ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో పార్టీకి చీఫ్ గా వ్యవహరించిన ఆయన పార్టీకి ఊపు తీసుకొచ్చారని చెబుతారు. అందరిని కలుపుకుని పోవడం కోసం బీజేపీ చీఫ్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తీసుకొచ్చినప్పటికీ.. బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి పార్టీ గౌరవించింది. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం సీఎం రేసులో ఉన్నారు. ఆయన కోరినట్టుగా పసుపు బోర్డు ప్రకటించడం కూడా కలిసివచ్చే అవకాశం. తెలంగాణలో పసుపు బోర్డు కేటాయించడం ద్వారా ఉమ్మడి నిజామాబాద్ లో బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీసీలందరూ ఏకమైతే బీజేపీ విజయం నల్లేరుపై నడకేనన్న భావన ఉంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో నలుగురు బీసీ నేతల్లో ఒకరికి సీఎం పదవి కట్టబెడతామని చెప్పడం ద్వారా ఆయా వర్గాల ఓట్లను గంపగుత్తగా పొందొచ్చని బీజేపీ విశ్వసిస్తోంది.