ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యం.. ఉచితంగా బస్సు ప్రయాణం
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశ పెట్టిన ఉచిత ప్రయాణ సౌకర్య పథకాన్ని కొనసాగించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే వారికి తిరుగు ప్రయాణాన్ని ఉచితం చేస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శామ్యూల్ తెలిపారు. అనారోగ్యం పాలై ఆర్టీసీ ఆసుపత్రికి వచ్చే రోగులకు అక్కడ వైద్యులు ఇచ్చే చిట్టీ ఆధారంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. అయితే ఇందులో ఓ మెలిక పెట్టింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించింది. హైదరాబాద్ పరిధిలో మాత్రమే ఈ సౌకర్యం అమలులో ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది.

అంతేకాకుండా దూర ప్రాంతాల నుండి టీఎస్ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ సౌకర్యం కల్పించింది. ఎంజీబీఎస్‌తోపాటు నగరంలో ఎక్కడ దిగినా ఈ ఉచిత బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని శామ్యూల్ వెల్లడించారు.