Breaking Newshome page sliderHome Page SliderInternationalNews

బ్యాన్ చేసిన ఇస్లామిక్ ప్రచారకుడికి బంగ్లాదేశ్ ఆహ్వానం

బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లోనే కాక అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చకు దారితీసే నిర్ణయం తీసుకుంది యూనస్ ప్రభుత్వం. ఇస్లామిక్ ప్రచారకుడు జకీర్ నాయక్‌ను నవంబర్ 28-29 తేదీల్లో ఢాకాలో జరిగే చారిటీ కార్యక్రమానికి ఆహ్వానించింది. గమనించదగిన విషయం ఏమిటంటే, ఏడు సంవత్సరాల క్రితం హసీనా షేక్ ప్రభుత్వం జకీర్ నాయక్‌కి దేశ ప్రవేశం నిషేధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఓవర్సీస్ ఇస్లామిక్ చారిటీల సహకారంతో ఢాకాలోని అగర్గావ్ ప్రాంతంలో జరగనున్న ఈ కార్యక్రమానికి యూనస్ ప్రభుత్వం ఆహ్వానం ఇచ్చింది. దీనిపై ఇప్పటికే బంగ్లాదేశ్ రాజకీయ, భద్రతా వర్గాల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. జకీర్ నాయక్‌ను మళ్ళీ దేశంలోకి అనుమతించడం 2016లో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో జకీర్ నాయక్ పేరు బంగ్లాదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2016 జూలైలో ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీ కేఫ్ పై జరిగిన ఉగ్రదాడిలో 22 మంది మరణించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు జకీర్ నాయక్ ప్రసంగాలతో ప్రేరణ పొందారని అప్పట్లో విచారణ సంస్థలు తేల్చాయి. దాంతో హసీనా సర్కారు అతనికి దేశ ప్రవేశాన్ని శాశ్వతంగా నిషేధించింది.

జకీర్ నాయక్‌పై భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) 2016లో ఉగ్రవాదం, మనీలాండరింగ్, విద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలతో కేసులు నమోదు చేసింది. అదే సంవత్సరం అతను దేశం విడిచి మలేషియాలో తలదాచుకున్నాడు. ప్రస్తుతం అక్కడ శాశ్వత నివాస హోదాతో జీవిస్తున్నాడు. జకీర్ నాయక్‌పై భారతదేశం పలుమార్లు అప్పగింత అభ్యర్థనలు చేసినప్పటికీ, మలేషియా ప్రభుత్వం అప్పటివరకు తటస్థ వైఖరినే కొనసాగించింది.

ఇటీవల మలేషియా ప్రభుత్వం వైఖరిలో కొంత మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలోని మలేషియా హైకమిషనర్ దాతో ముజాఫర్ షా ముస్తఫా, “జకీర్ నాయక్ అప్పగింత విషయంలో భారత్‌తో పూర్తి స్థాయిలో సహకరిస్తాం” అని ప్రకటించారు. అయినప్పటికీ, ఇప్పటివరకు ఆ ప్రక్రియలో స్పష్టమైన పురోగతి కనిపించలేదు.

జకీర్ నాయక్‌కి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం అంతర్జాతీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉగ్రవాదం వ్యతిరేకంగా పోరాడుతున్న దేశం నుంచే ఇలాంటి ఆహ్వానం రావడం ఆందోళన కలిగించే పరిణామంగా పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
యూనస్ ప్రభుత్వ ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌కి కొత్త దౌత్య, భద్రతా సవాళ్లను తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.