రికార్డు ధర పలికిన బంగినపల్లి మామిడి
బంగినపల్లి మామిడి రికార్డు ధర పలికింది. టన్ను బంగినపల్లి మామిడికి రూ.1.22 లక్షలు చెల్లించారు. ఇంతకీ ఎక్కడో తెలుసా? వరంగల్ ఎనుమాముల ముసలమ్మకుంటలో ప్రారంభమైన నూతన మామిడి మార్కెట్లో ఈ ధర పలికింది. మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డా.సత్యశారద సమక్షంలో మార్కెట్లో తొలిసారిగా మామిడి వేలం పాట నిర్వహించారు.ఈ వేలం పాటలో వ్యాపారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లకు చెందిన విజయపాల్ రెడ్డి తీసుకొచ్చిన బంగినపల్లి మామిడికి టన్ను రూ.1.22 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. మార్కెట్ చరిత్రలో మామిడికి ఈ స్థాయి ధర పలకడం ఇదే తొలిసారని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
