బండి అరెస్టు హైడ్రామా.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకోవడంతో రాజకీయ దుమారం రేగుతోంది. సంజయ్ అరెస్టు అక్రమమని, సరైన కారణం లేకుండా అరెస్టు చేశారని ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హెబియస్ కార్పస్ పిటిషన్‌ను బీజేపీ నేత సాంరెడ్డి సురేందర్ రెడ్డి దాఖలు చేశారు. ప్రతివాదులుగా హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ సీపీలు, బొమ్మల రామారం సీఐని చేర్చారు. అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని బీజేపీ నేతలు దుయ్యబడుతున్నారు. కనీసం అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు సైతం చెప్పలేదంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సీఆర్పీసీ 50 కింద అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తం వ్యవహారంపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుకు ఫోన్ చేసి ఆరా తీశారు. మరోవైపు సంజయ్ అరెస్టుపై హోం మంత్రి అమిత్ షా సైతం ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మొత్తం వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డీజీపీతో మాట్లాడారు.

ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ వెలుపల ధర్నాకు దిగారు. పోలీసుల చర్యను ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సంజయ్ అరెస్టు అప్రజాస్వామికమని.. ఎలాంటి నోటీసులు లేదా వారెంట్ లేకుండానే అరెస్టు చేశారని, అభియోగాల గురించి సైతం పోలీసులు చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఒక ఎంపీనీ కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ చెప్పినట్టు పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారని… పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తప్పు దోవపట్టించడానికి బండి సంజయ్ అరెస్ట్ అని మండిపడ్డారు.
ఏప్రిల్ 9న తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న తరుణంలో సంజయ్ అరెస్టు జరిగడంతో బీజేపీ నేతల్లో ఆగ్రహం కట్టులు తెంచుకొంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ గత కొంత కాలంగా ప్రయత్నిస్తూ వస్తోంది. ఐతే బండిని పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీక్‌కు సంబంధించి అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలపై సంజయ్‌ను అరెస్టు చేసినట్లు బీజేపీ జాతీయ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. ఇది కేసీఆర్‌కు మంచిది కాదని ఆయన హితవు పలికారు.

