‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బండి సంజయ్ పేరు చెప్పాలంట..!
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) విచారణ పారదర్శకంగా లేదని న్యాయవాది భూసారపు శ్రీనివాస్ విమర్శించారు. ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమేయం ఉందని చెప్పాలంటూ సిట్ బృందం ఒత్తిడి చేసిందని ఆరోపించారు. ఈ కేసులో సీఆర్‌పీసీ 41ఏ కింద తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. తాను సిట్ ఎదుట మూడు రోజుల పాటు హాజరయ్యానని.. ఈ సందర్భంగా బండి సంజయ్ పేరు చెప్పాలని అధికారులు వేధించారంటూ న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలా చేయకుంటే తనను ఏ-7 నిందితునిగా చేర్చుతామని అధికారులు హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడమే చట్ట విరుద్ధమని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోర్టును కోరారు. శ్రీనివాస్ ఈ నెల 21, 22 తేదీల్లో సిట్ ఎదుట హాజరయ్యారు.