బండి సంజయ్ అరెస్ట్ దుర్మార్గం అప్రజాస్వామికం-కిషన్ రెడ్డి
బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి మానసికంగా హింసించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది కేసీఆర్ దుర్మార్గ పాలనకు పరాకాష్ట అంటూ ఆయన మండిపడ్డారు. కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం బండి సంజయ్ ని A1 గా పెట్టారన్నారు. టెర్రరిస్టుల కంటే దారుణంగా బండి సంజయ్‌ని ట్రీట్ చేశారని దుయ్యబట్టారు. కేసులకు జైళ్లకు బీజేపీ భయపడేది లేదన్న కిషన్ రెడ్డి… లక్షల మంది కార్యకర్తలు జైళ్లకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. అధికారం చేతిలో ఉందని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. BRS నేతలతో కూడా ఫోటోలు ఉంటే… వాళ్ళతో కూడా సంబంధం ఉన్నట్టేనా అంటూ ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులు అని గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం చేసి… కల్వకుంట్ల పాలన, రజాకార్ల పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేస్తామన్నారు కిషన్ రెడ్డి.
కేసీఆర్ కళ్ళలో ఆనందం చూడడం కోసం పోలీసులు ప్రయత్నం చేశారన్నారు. కల్వకుంట్ల కుటుంబ మెప్పు పొందడం కోసం విపక్షాలను వేధిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పరిపాలనా వైఫల్యాలను బీజేపీ ప్రశ్నిస్తోందని.. అందుకే ఆ పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెగబడుతోందన్నారు. బండి సంజయ్‌ని ఓ టెర్రరిస్ట్ లా అనేక వాహనాలు మార్చడమే కాకుండా, పలు స్టేషన్లు తిప్పి హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్‌కి బీఆర్ఎస్ నేతలతో సంబంధాలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. అలాంటప్పుడు వారికి కూడా పేపర్ లీక్‌లో ప్రమేయం ఉంటుందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీక్‌కు సంబంధించి మీడియాలో బ్రేకింగ్ వచ్చిన చాలాసేపటి తర్వాత సంజయ్ ఫోన్‌కి వచ్చిందని దాంతో ఆయనకు ఏం సంబంధమన్నారు. ఎంత అణిచివేయాలని చూస్తే అంత బాగా బలపడతామన్న కిషన్ రెడ్డి… తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమన్నారు.