కేటీఆర్ బీసీలకు క్షమాపణ చెప్పాలని కోరిన బండి
తెలంగాణ చౌక్ (కరీంనగర్): మంత్రి కేటీఆర్ బీసీలను అవమానించేలా మాట్లాడారని, వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించగానే కేటీఆర్‌కు కులం కంటే గుణం ముఖ్యమనే మాటలు గుర్తుకొచ్చాయా? ఇది బీసీలను అవమానించడమే. కేటీఆర్ వ్యాఖ్యలపై కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కై బీజేపీ గ్రాఫ్ పడిపోయేలా కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులకు కేసీఆర్ స్వయంగా డబ్బులు పంచారు. బీఆర్‌ఎస్‌తో కలిసి అధికారం పంచుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన మాటలు వాస్తవం కాదా? కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు కోసం కాళ్లావేళ్లా పడి బతిమాలుతోంది. కరీంనగర్‌లో పోటీచేస్తామన్న ఎంఐఎం ఎందుకు పోటీచేయడం లేదు? ఎంఐఎం కు బీఆర్ఎస్ భారీగా డబ్బులు అందజేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకావడం లేదని అక్కడి ప్రజలే తెలంగాణకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

