బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి ప్రమాదం
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గవర్నర్ దత్తాత్రేయ క్షేమంగా బయటపడ్డారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి హర్యానా వెళ్లేందుకు దత్తాత్రేయ శంషాబాద్ విమానాశ్రయానికి బయల్దేరారు. కిషన్ గూడ ట్రంపెట్ వంతెన సమీపంలోకి రాగానే.. కాన్వాయ్ లోకి అకస్మాత్తుగా టోలిచౌకి నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్తున్న ఫోర్డ్ ఎండీవర్ కారు సడెన్ గా ముందుకొచ్చింది. అప్పటికే గవర్నర్ దత్తాత్రేయ వెహికల్ ముందుకు వెళ్లింది. వెనకాల ఉన్న ఎస్కార్ట్ వెహికల్ సడెన్ బ్రేక్ వేయడంతో మూడు వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది గవర్నర్ దత్తాత్రేయను క్షేమంగా ఎయిర్ పోర్టుకు తరలించారు. ఎయిర్ పోర్టు పోలీసులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ సర్ఫరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

