Andhra PradeshHome Page Slider

బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్తారా? ఆ పార్టీలోకి వెళ్తారా?

పొమ్మన లేక పొగ పెడుతున్నారంటూ క్యాడర్ గుసగుసలు
నెల్లూరు, చిత్తూరు, తిరుపతి రీజినల్ కోఆర్డినేటర్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన బాలినేని
వరస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అయిన బాలినేని
బాలినేని ఎపిసోడ్ వైఎస్ఆర్సిపికి ఇబ్బందికరమని అంటున్న రాజకీయ మేధావులు

ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ సీపీకి కీలక నేతల్లో ఒకరైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గత ఏడాది వరకు ఆ జిల్లాలో హవా సాగించారు. కానీ మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఆయన మాట్లాడే ప్రతి అంశం వివాదాస్పదం కావడం గమనార్హం. వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయటం సొంత పార్టీలోనే తనపై కుట్ర జరుగుతుందని కంటతడి పెట్టి మరి ఆవేదన వ్యక్తం చేయటం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయిన తరువాత వైఎస్ఆర్సీపీలో స్తబ్దత నెలకొంది. బాలినేని శ్రీనివాసరెడ్డిని పొమ్మనలేక పొగ పెడుతున్నారా అనే సందేహాలు ఆ పార్టీలోని క్యాడర్లో వ్యక్తం అవుతుంది. తన మాటే వేదంగా సాగిన స్థితి నుంచి భవిష్యత్తు ఏమిటి అనే దుస్థితి బాలినేనికి ఎదురవటం ఆయన వర్గం జీర్ణించుకోలేక పోతుంది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు వైయస్సార్సీపీలో పెద్దన్నయ్య పాత్ర పోషించిన ఆయనకు సొంత పార్టీలోనే వర్గాలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు ఒక్కొక్కటిగా రగులుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ కలహాల కుంపట్లు ఎటువైపుకు దారితీస్తాయోనని ఆందోళన పార్టీ వర్గాల్లోనూ వ్యక్తం అవుతుంది. పార్టీలో అంతా తానై నడిపించిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎటు చూసినా చేదు అనుభవాలు ఎదురవటంతో భరించలేకపోయారు. వరుస వివాదాలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. పైగా సొంత పార్టీ వాళ్లే తనపై కక్ష కట్టారని స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పటం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. ఈ పరిణామాలే మీడియా సమావేశంలో ఆయనను కంటతడి పెట్టించాయని భావన ఆయన అనుకూల వర్గంలో వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాల అనంతరం పార్టీలో స్తబ్దత నెలకొంది.

ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైయస్సార్సీపీలోనే ఉంటారా లేక పార్టీ మారతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆయన తాను పార్టీలోనే ఉంటానని చెప్పినప్పటికీ పార్టీలో ఎదురైన అనుభవాలు జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా ఆయన పార్టీ మారే అవకాశం ఉందని ఆ సూచనలు కనిపిస్తున్నాయని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి దర్శి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారని ప్రచారం జిల్లాలో జోరందుకుంది. విలువలు లేని చోట తనకు పదవులు వద్దంటూ నెల్లూరు చిత్తూరు తిరుపతి రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన ఆయన తన దారి తనదే అనే సిగ్నల్ వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి ఇచ్చినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండటం నెల్లూరు జిల్లాతో పాటు తాడికోండ ఎమ్మెల్యే కుదుపు నుంచి తేరుకోక ముందే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ పార్టీకి ఇబ్బందికరమేనని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు.